హరీశ్‌ రావుకు పితృవియోగం..

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఇంట విషాదం నెలకొంది. హరీశ్‌ తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్‌ కోకాపేటలోని క్రిన్స్‌విల్లాస్‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. హరీశ్‌రావుకు పితృవియోగంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. హరీశ్‌ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం
పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తన బావతో (కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీ గారి భర్త) తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీశ్‌ రావును ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో కోకాపేటలోని హరీశ్‌ రావు నివాసానికి వెళ్లి, దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు.