తెలంగాణ పత్తి రైతుల కష్టాలు తీర్చండి..తేమ శాతం తగ్గించండి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • అకాల వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు.. పత్తి మద్దతు ధర పెంచి తెలంగాణ రైతును ఆదుకోండి
  • తెలంగాణ పత్తి రైతుల సమస్యలు, తేమ శాతం సడలింపు, MSP పెంపు కోరుతూ CCI ఛైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముంబై: తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. వారిద్దరి మధ్య గంట పాటు సాగిన ఈ సమావేశంలో, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, MSP సేకరణ, మరియు రైతులకు తక్షణ ఉపశమనం అందించాల్సిన అవసరాన్ని మంత్రి సీసీఐ చైర్మన్ కు వివరించారు.

సమావేశంలో మంత్రి ప్రస్తావించిన ప్రధాన అంశాలు: తేమ శాతం సడలింపు తప్పనిసరి: తెలంగాణతో సహా దక్షిణ భారత రాష్ట్రాలలో అధిక తేమ స్థాయిలు ఉన్న కారణంగా, ప్రస్తుత FAQ (Fair Average Quality) నిబంధనల ప్రకారం నిర్దేశించిన 8-12% తేమ శాతాన్ని పాటించడం అసాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అందుకే, రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే 14% వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

MSP పెంపు, సేకరణ విస్తరణ: పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా పత్తికి కనీస మద్దతు ధర (MSP)ని సవరించాలని, అలాగే అన్ని పత్తి పండించే జిల్లాల్లో CCI కొనుగోలు కేంద్రాలను విస్తరించి , ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని కోరారు.

తక్షణ ఉపశమన చర్యలు: తెగులు నష్టం (Pink Bollworm Pest) మరియు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ అందించాలి. గత సీజన్లలో సేకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మార్కెట్ యార్డ్ స్థాయిలో ఆధునిక తేమ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.తెలంగాణ రైతులకు న్యాయం జరిగి, వస్త్ర సరఫరా గొలుసు బలోపేతం అయ్యేలా CCI చైర్మన్ వ్యక్తిగత శ్రద్ధ వహించాలి.” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థించారు. మంత్రి తన విజ్ఞప్తిలో పేర్కొన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం తో చర్చించి,సానుకూలంగా పరిష్కరిస్తామని CCI చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా..మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి హామీ ఇచ్చారు. మంత్రి వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఉన్నారు.