తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి స్వరాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సిటిజన్ సర్వే’ను ప్రారంభించింది. ఈ సర్వే ప్రజల ఆలోచనలు, కలలు, ప్రాధాన్యతలను సేకరించి, రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి పునాదులు వేయాలన్న సంకల్పంతో రూపొందించబడింది. గత వారం ప్రారంభమైన ఈ సర్వేకు రాష్ట్రవ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తోంది. వేలాది మంది ఇప్పటికే తమ అభిప్రాయాలు, సూచనలు పంచుకొని, భారత స్వాతంత్య్రానికి 100 సంవత్సరాలు పూర్తికానున్న 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలి అన్న దానిపై తమ దృష్టిని తెలియజేశారు.

ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం :
ప్రతి గ్రామం, పట్టణం, నగరంలోని ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా — ఒక ప్రగతిశీల, సుస్థిర, సమానత్వ తెలంగాణ కోసం సమగ్ర మార్గపటాన్ని రూపొందించడం.
సర్వే ద్వారా ప్రజలు విద్య, ఉపాధి, ఆవిష్కరణ, మహిళా సాధికారత, ఆరోగ్యం, పచ్చదనం, జీవన ప్రమాణాలు వంటి కీలక రంగాలపై తమ ఆలోచనలు పంచుకుంటున్నారు.

అధికారుల నివేదన:
“ఇది కేవలం పాలసీ ప్రణాళిక మాత్రమే కాదు — తెలంగాణ భవిష్యత్తును ప్రజలే ఊహించి నిర్మించుకునే ఉద్యమం. ఇప్పటికే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా పాల్గొనని పౌరులు తప్పక తమ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.”

ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సులభంగా అందుబాటులో ఉంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మెట్రో స్టేషన్లు, విద్యాసంస్థలు, పౌర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్‌లను స్కాన్ చేసి లేదా www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌ను సందర్శించి పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనడానికి గడువు నవంబర్ 1, 2025 వరకు పొడిగించబడింది. మీ ఆలోచన, మీ స్వరం — తెలంగాణ 2047 దిశను నిర్ణయించగల శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఈరోజే పాల్గొని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో మీ ముద్ర వేయండి