తెలంగాణ గుండెలపై ఫార్మా పరిశ్రమల కుంపటి..!

  • పచ్చని పల్లెలపై కెమికల్స్ దాడి..
  • ఖాళీ స్థలాలనూ.. చెరువులను.. కుంటలను వదలని పరిశ్రమలు
  • వ్యర్థాలను కుప్పలుగా పోసి నిప్పు..
  • జిన్నారం, పటాన్ చెరు, పోలేపల్లి, చౌటుప్పల్, జీడిమెట్ల, సంగారెడ్డి, మేడ్చల్ లో పరిస్థితి దారుణం
  • కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నామంటున్న కాలుష్య బాధితులు
  • లంచాల మత్తులో పలువురు పిసిబి అధికారులు

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న నీటితో తెలంగాణలో భూగర్భ జలాలు, పంట పొలాలు, చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రస్తుతం అవే పరిశ్రమలు ఖాళీ స్థలాలను సైతం వదలడం లేదు. పరిశ్రమలలోని వ్యర్థాలను గుట్టలు, అటవీ ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలలలో కుప్పలుగా పోసి నిప్పంటిస్తున్నారు. లేదా అలాగే వదిలేసి వెళ్తున్నారు. దీంతో అక్కడి వాతావరణం కలుషితమవుతోంది. భూగర్భ జలాలు, పంట పొలాలు, చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడే విధంగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమను కాల్చివేస్తానంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. విడతల వారీగా ఆ కుప్పలకు నిప్పంటిస్తున్నారు. దీంతో వ్యర్థాలను కాల్చడంతో వస్తున్న పొగతో రోగాల బారిన పడుతున్నామంటూ పోలేపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భజలాలు కలుషితం అయ్యాయని, పంటలు పండించుకునేందుకు వీలులేని విధంగా వ్యవసాయ క్షేత్రాలు కాలుష్యం బారిన పడ్డాయని, చెరువులు-కుంటలలో పెంచుకుంటున్న చేపలు సైతం కాలుష్యం నీటితో మృతి చెందాయని వాపోతున్నారు. పోలేపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్న టీఎస్‌ఐఐసీ ఖాళీ స్థలంలో వ్యర్థాలను డంపింగ్‌ చేయడం, నిప్పంటించడంతో వస్తున్న పొగ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే అరికట్టాలంటూ వేడుకుంటున్నారు.

పిట్టంపల్లిలో ఓ కంపెనీ రసాయన వ్యర్ధాలు తిని 11 గొర్రెలు మృతి
రసాయన కంపెనీలు విడుదల చేసే వ్యర్ధాలను తిని 11 గొర్రెలు మృతి చెందిన ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పీఠంపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే పీఠంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మెట్టు లింగయ్య తన గొర్రెలను తోలుకొని మేతకు వెళ్లాడు. కాగా గ్రామ పరిధిలోని రసాయన కంపెనీలు వదిలేసే విషపూరిత వ్యర్థాలను అక్కడి గుట్టల ప్రాంతంలో పారబోయడం వల్ల గొర్రెలు వాటిని తిని అక్కడికక్కడే 11 గొర్రెలు మృతి చెందగా మరో 50 గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయి అని అవి కూడా మేత మేయడం లేదని ఆ రైతు వాపోతున్నారు. రసాయన కంపెనీల యాజమాన్యాలు విషపూరిత వ్యర్థాలు బ్యాగులలో నింపి విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ వదిలేయడంతో వాటిని తిన్న మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. రసాయన కంపెనీలు విడుదల చేసే విషపూరిత వ్యర్ధాలను పరిసర ప్రాంతాల్లో వదిలేయకుండా కంపెనీ ఆవరణలోనే నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకోవాలి. అవి రసాయన ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలించాలి కానీ అలా కాకుండా కంపెనీ యాజమాన్యం విషపూరిత రసాయనలను పరిసర ప్రాంతాల్లో వదిలివేయడం వల్ల పర్యావరణం క్షీణించి వన్యప్రాణులే కాకుండా ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో చుట్టు పక్కల ఉన్న ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు ఇస్టారీతిలో ఎక్కడపడితే అక్కడ రసాయన వ్యర్ధాలు పారబోస్తున్నారని, ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుని తమకు తగిన న్యాయం చేయాలని గొర్రెల కాపరులు, గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. గత నెల చివరలో జరిగిన ఈ సంఘటన ఈ నెల 5న బయటకు రావడం జరిగింది. రసాయన వ్యర్ధాలు పారబోసిన పరిశ్రమను గుర్తించి కూడా దానిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పిసిబి అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు అందాయని అందుకే ఆ పరిశ్రమపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నష్టపోయిన రైతుకు ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇప్పించలేదని స్థానిక రైతులు, పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

మొన్నటి వర్షాలలో అనేక పరిశ్రమలు విపరీతమైన రసాయనాలను విచ్చలవీడిగా వర్షపు నీటితో కలిపి చెరువులలో.. కుంటలలోకి వదులుతున్నారని వాటి వల్ల చెరువులు, కుంటలు రసాయన వ్యర్ధలతో నిండిపోయి ఉన్నాయని ఆ నీరు మూగ జీవలు తాగడంతో అవి చనిపోతున్నాయని ఎన్ని ఫిర్యాదులు చేసిన పిసిబి అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, కాలుష్య బాధితులు తెలిపారు. ఉదాహరణకు జిన్నారంలో హెటిరో ఫార్మా వదిలిన రసాయనాలతో నల్లచెరువు మొత్తం రంగు మరి కనపడుతున్న పర్యావరణ వేత్తలు, మేధావులు, ప్రజా సంఘాలు, రైతులు, కాలుష్య బాధితులు నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా పిసిబి అధికారులకు మాత్రం కనిపించడం లేదు. ఇంతటి కాలుష్యం చేసిన పరిశ్రమపై ఎటువంటి చర్యలు లేవంటేనే వెనుక ఏం జరిగిందో అర్ధం చేసువచ్చు అని పలువురు పర్యావరణ వేత్తలు అంటున్నారు. తెలంగాణలో పర్యావరణం రసాయన వ్యర్ధలతో రగులుతుంటే కొంత మంది పిసిబి అధికారులు మాత్రం చలి కాచుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణలో భవిష్యత్ తరాలకు ఏ మాత్రం మంచిదికాదని పలువురు పర్యావరణ వేత్తలు, మేధావులు చెబుతున్నారు.

అంతేకాదు కాలుష్య పరిశ్రమలకు నోటీస్ లు జారీచేసి మూసివేతకు ఆదేశాలు ఇచ్చినట్టే ఇచ్చి అట్టి పరిశ్రమలకు ఎటువంటి టాస్క్ ఫోర్స్ హియరింగ్ లేకుండా తిరిగి ఉత్పత్తులు కొనసాగించడానికి అనుమతులు ఇవ్వడం వెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయి అని పలువురు పిసిబి అధికారులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్న అంతమ్మ గూడెం, దొతిగూడెంలలో ఉన్న 11 రసాయన పరిశ్రమల నుండి జడ్చర్ల సెజ్ లో ఉన్న రసాయన పరిశ్రమలు, జిన్నారం, పాశమైలారం పటాన్ చెరు, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని రసాయన పరిశ్రమల నుండి పెద్ద మొత్తంలో లంచాలు పిసిబి అధికారులకు అందుతున్నాయని అందుకే వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కాలుష్య పరిశ్రమలకు సంబంధించి ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలు చేసిన ఫిర్యాదులపై నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ఫిర్యాదుపై విచారించి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. కాలుష్య పరిశ్రమలు అక్రమంగా నిబంధనలు ఉల్లంఘించడం వలన, పరిసర గ్రామాలలోని భూగర్భ జలాలు కలుషితం కావడంతో.. ఏళ్ళుగా పంటలు పండక నష్టపోయిన రైతులకు, గీత కార్మికులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించే విధంగా, పర్యావరణ విధ్వంసానికి పాల్పడినందున వారి నుండి పరిహారం ఇప్పంచాలని రైతులు, ప్రజా సంఘాలు చేసిన ఫిర్యాదులపై విచారించినా, చర్యలు చేపట్టిన దాఖాలాలు లేవు.. నేటికి ఫిర్యాదుదారులకు, వారి ఫిర్యాదులపై విచారించినట్లు కనీస సమాచారం ఉండటం లేదంటే పిసిబి అధికారులు ఏ స్థాయిలో పరిశ్రమల వారి నుండి లంచాలు తీసుకొని వారిని కాపాడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు. తెలంగాణలో పర్యావరణ నాశనం కావడానికి పరిశ్రమల యాజమాన్యాలతో పాటు పిసిబి అధికారులు కూడా ముఖ్య కారణం అని తెలంగాణలో మేధావులు, పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు చెబుతున్నారు.