సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు జరిమానా

  • సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంపై కమిషన్‌ సీరియస్‌
  • ఒక కేసులో డీఈఈకి రూ. 5 వేల జరిమానా.. మరో కేసులో పీఆర్‌వోకు రూ. 2 వేలు
  • కమిషనర్‌ పీవీ శ్రీనివాసరావు ఆదేశాలు
  • రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ అధికారులకు జరిమానా విధించడం ఇదే ప్రథమం

సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్‌ జరిమానా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎన్‌.జంగయ్య అనే వ్యక్తి 2024 ఫిబ్రవరి 24న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయంలో ఆర్టీఐ యాక్ట్‌ కింద దరఖాస్తు సమర్పించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని నెలరోజుల్లో ఇవ్వాల్సి ఉండగా.. ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో ఆయన కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్‌ కార్యాలయం డీఈఈ రమణా నాయక్‌కు షోకాజ్‌ నోటీసు జారీచేసింది. గత నెల 22న స్వయంగా హాజరు కావాలని నోటీసు పంపింది. కానీ, ఆయన గైర్హాజరు అయ్యారు. దీంతో ఆయనకు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆర్టీఐ కమిషనర్‌ పివి.శ్రీనివాసరావు ఇటివలే ఆదేశాలు జారీచేశారు. మరో కేసులో.. మునిసిపాలిటీకి సంబంధించిన సమాచారం కావాలని జగిత్యాలకు చెందిన ఏ.చంద్రశేఖర్‌ అనే వ్యక్తి 2022 జనవరిలో దరఖాస్తు చేశారు. దీనిపై కమిషన్‌ పలుమార్లు ఆదేశించినా సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుకు రూ.2 వేలు పరిహారంగా చెల్లించాలని జగిత్యాల మునిసిపాలిటీప్రజా సమాచార అధికారికి కమిషనర్‌ పివి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం వహించేఅధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. సమాచార కమిషనర్‌ ప్రభుత్వ అధికారులకు రూ. 5వేల జరిమానా విధించడం ఇదే ప్రథమం.