రక్తదానంతో సాటి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ కార్యక్రమాల సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేలసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తం అందుబాటులో ఉంటే అందులో కొంతమందినైనా కాపాడవచ్చునని తెలిపారు. ప్రతి ఏడాది నాలుగుసార్లు రక్తం ఇవ్వొచ్చని, కనీసం ఒకసారైనా రక్తదానం చేయాలని కోరారు. రక్తదాన శిబిరంలో 4,500 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు ఆయన వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో తొలిసారి నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఐజీపీలు ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎం రమేశ్, ఏఐజీలు రమణకుమార్, నాగరాజు, డాక్టర్ పిచ్చిరెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీరాములు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.