వర్షం మాటున రసాయన పరిశ్రమల కాలుష్య జలాలు

  • అడ్డగోలుగా బయటకు వదులుతున్న రసాయన పరిశ్రమల
    యాజమాన్యాలు
  • కలుషితమవుతున్న చెరువులు, కుంటలు
  • నిద్రావస్థలో తెలంగాణ పీసీబీ అధికారులు
  • రేపు కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని ర్యాలీ

భారీ వర్షాలు పడుతున్న సమయాన్ని తెలంగాణలోని రసాయన పరిశ్రమల యాజమాన్యాలు తమ స్వార్ధనికి అవకాశంగా తీసుకుంటున్నాయి. వర్షపు నీటితో కలిసి రసాయన పరిశ్రమలు కాలుష్య జలాలను బయటకు వదలడం ఆనవాయితీగా మారింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి, గడ్డ పోతారం, పటాన్ చెరు, జీడిమెట్ల, మేడ్చల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి, షాద్ నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, అంతమ్మ గూడెం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పారిశ్రామికవాడల్లో అనేక వివిధ రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో రసాయన పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థ రసాయన జలాలను బయటకు వదులుతున్నాయి. ఈ విషయం తెలంగాణ పీసీబీ అధికారులకు తెలిసినా వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. కాలుష్య జలాలు బయటకు వస్తుండటంతో సమీపంలోని చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయి. ప్రస్తుతం మొంథా తుపాన్ తో విస్తారంగా వర్షాలు కురుస్తుండటాన్ని రసాయన పరిశ్రమల యాజమాన్యాలు అదునుగా చేసుకుంటున్నాయి. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రసాయన పరిశ్రమల నుంచి అవుట్ లెట్ల ద్వారా కాలుష్య జలాలు బయటకు వస్తున్నాయి. ట్రీట్ మెంట్ ప్లాంట్లకు పంపాల్సిన వ్యర్థ జలాలను నిబంధనలకు విరుద్ధంగా బయటకు వదిలేస్తున్నారు. నిఘా పెట్టాల్సిన పీసీబీ అధికారులు ఇటు వైపు చూడటం లేదు.

ఓవైపు కాలుష్యాన్ని కట్టడి చేయటానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, చర్యలు తీసుకుంటున్నామంటూ పీసీబీ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కానరావడం లేదు. గురువారం పారిశ్రామిక ప్రాంతాల్లో వర్షం కురవలేదు. ఖాజీపల్లి శివారులోని జిల్లెలవాగు మాత్రం నురగలు కక్కుతూ.. ఘాటు వాసనలు వెదజల్లుతోంది. రసాయన పరిశ్రమలు విడుదల చేసిన వ్యర్థాల వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఖాజీపల్లి శివారులోని కల్వర్టు వద్ద తెల్లటి నురగ పెద్దఎత్తున పోగయింది. ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు

రేపు కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని ర్యాలీ
పారిశ్రామిక వాడలో కాలుష్యాలను వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలను మూసివేయాలని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు నిచ్చారు. నవంబర్ 1న అమరవీరుల స్థూపం నుంచి బొంతపలి కమాన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు తెలిపారు. ర్యాలీని విజయవంతం చేయాలని కేవీపీసీ కన్వీనర్ మెంగని మంగయ్య, సభ్యులు కోరారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు పట్టణానికి చెందిన రైతులు, యువకులు, గ్రామస్తులందరూ పాల్గొనాలన్నారు. ఇష్టారీతిన రసాయన వ్యర్థ జలాలను, విషవాయువులను వదిలి పర్యావరణాన్ని, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న రసాయన పరిశ్రమలను బంద్ చేయాలని డిమాండ్ చేశారు.