తుపాను బాధిత కుటుంబాలను ఆదుకోండి: కార్పోరేట్ సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

మొంథా తుపానుతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించాల్సిందిగా పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పౌరులు, రైతుల కోసం సహాయ, పునరావాస శిబిరాలు నిర్వహించాలని పలు సంస్థలకు లేఖలు రాసారు. సామాజిక బాధ్యతగా నిత్యావసర వస్తువులు, ఔషధాలు, వైద్య సహాయం అందించాని శ్రీధర్ బాబు కోరారు. ఆపత్కాలంలో వారికి అండగా నిలిచి చితికిన కుటుంబాలను తిరిగి నిలబెట్టాలని ఆయన పేర్కొన్నారు. పొలాల్లోని పంటలు వరదలకు దెబ్బతిన్నాయని, మార్కెట్లకు తరలించిన ధాన్యం, మక్కలు వాన నీటిలో తడిసాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అందించే సాయంతో పాటు ప్రైవేటు సంస్థల కూడా తమ వంతు సహకారం అందిస్తే అకాల వర్షాలతో నష్టపోయినవారు త్వరగా కోలుకుంటారని శ్రీధర్ బాబు అన్నారు.