- ప్రజా విజయోత్సవాల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం ఎలా సాధించాం, కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం, భవిష్యత్తు లో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించబోతుంది అనే విషయాలను ప్రపంచానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నాం, పెద్ద ఎత్తున mou లు జరిగేలా వాతావరణం ఉండాలి అన్నారు. దుబాయ్ ఫెస్టివల్ పూర్తిగా దుబాయ్ పట్టణానికి దూరంగా జరుగుతుంది అదే పద్ధతిలో మన రాష్ట్రంలోనూ ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. సీనియర్ మరియు జూనియర్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలని ప్రణాళికా ప్రకారం పనులు విభజించుకుని నాణ్యతతో సకాలంలో అనుకున్న ప్రణాళికను అమలు చేసేలా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, మూసి పునర్జీవనం, ఫ్యూచర్ సిటీ, ఇప్పటికే అనేక పరిశ్రమలను తెలంగాణ ఆకర్షిస్తుంది, భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించే విధంగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.