- అడ్డగోలుగా రసాయన వ్యర్ధాలను పారబోస్తున్న పరిశ్రమల
యాజమాన్యాలు - తప్పు చేసిన ఫ్యూజన్ ల్యాబ్స్ (మాన్వి ఫార్మా), హెటిరో, అరబిందో, కార్తీకేయ లాంటి ఫార్మా పరిశ్రమలపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
- పిసిబి అధికారులు మాకేమీ పట్టదు అన్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు..?
ఫార్మా పరిశ్రమలలో నుంచి కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్‌లలో నింపుకుని వచ్చి టీఎస్‌ఐఐసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో పారబోసిన సంఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు… జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని కార్తీకేయ ఫార్మా పరిశ్రమ యూనిట్ 5లో నుంచి వ్యర్థాలను ట్రాక్టర్ ట్యాంకర్‌లో నింపుకుని వచ్చి టీఎస్‌ఐఐసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో పారబోస్తున్నారు. ట్రాక్టర్ ట్యాంకర్‌లో తీసుకువచ్చి వ్యర్థాలను పారబోస్తుండగా పట్టుకుని ప్రశ్నించగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని, ఇక్కడే పారబోస్తామంటూ పరిశ్రమ ప్రతినిధి భయభ్రాంతులకు గురిచేశారంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో నుంచి తీసుకువచ్చి పారబోసిన కెమికల్ వ్యర్థాల నుంచి బురుగులు రావడంతో భయాందోళనకు గురవుతున్నామని, దుర్వాసన వస్తుందంటూ వాపోయారు. ఖాళీ స్థలంలో వ్యర్థాలను పారబోయడంతో కెమికల్ వ్యర్థాలతో పెద్ద గోతిలా ఏర్పడిందని, ఆ గుంత మొత్తం కాలుష్యం నీటితో నిండిపోయిందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. వ్యర్థాలను తీసుకువచ్చి పోస్తున్న పరిశ్రమలపై పిసిబి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యవహారంపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పంధించి వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఓవైపు కాలుష్యాన్ని కట్టడి చేయటానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, చర్యలు తీసుకుంటున్నామంటూ పీసీబీ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కానరావడం లేదు. పారిశ్రామిక ప్రాంతాల్లో వర్షం లేకున్నా సరే ఖాజీపల్లి శివారులోని జిల్లెలవాగు మాత్రం నురగలు కక్కుతూ.. ఘాటు వాసనలు వెదజల్లుతోంది. రసాయన పరిశ్రమలు విడుదల చేసిన వ్యర్థాల వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఖాజీపల్లి శివారులోని కల్వర్టు వద్ద తెల్లటి నురగ పెద్దఎత్తున పోగయింది. ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి, గడ్డ పోతారం, పటాన్ చెరు, జీడిమెట్ల, మేడ్చల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి, షాద్ నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, అంతమ్మ గూడెం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పారిశ్రామికవాడల్లో అనేక వివిధ రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో రసాయన పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థ రసాయన జలాలను బయటకు వదులుతున్నాయి. వర్షాలు పడకున్న సరే వ్యర్ధ రసాయన జలాలను ట్యాంకర్లలో నింపుకుని వచ్చి ఎక్కడ పడితే అక్కడ వాదులుతున్న ఈ విషయం తెలంగాణ పీసీబీ అధికారులకు తెలిసినా వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. కాలుష్య జలాలు బయటకు వస్తుండటంతో సమీపంలోని చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయి. ప్రస్తుతం మొంథా తుపాన్ తో విస్తారంగా వర్షాలు కురుస్తుండటాన్ని రసాయన పరిశ్రమల యాజమాన్యాలు అదునుగా చేసుకుంటున్నాయి. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రసాయన పరిశ్రమల నుంచి అవుట్ లెట్ల ద్వారా కాలుష్య జలాలు బయటకు వస్తున్నాయి. ట్రీట్ మెంట్ ప్లాంట్లకు పంపాల్సిన వ్యర్థ జలాలను నిబంధనలకు విరుద్ధంగా బయటకు వదిలేస్తున్నారు. నిఘా పెట్టాల్సిన పీసీబీ అధికారులు ఇటు వైపు చూడటం లేదని దానికి కారణం పరిశ్రమల యాజమాన్యాల నుండి పిసిబి అధికారులకు నెలవారీ లంచాలు అందుతున్నాయని అందుకే వారు పరిశ్రమల వారు ఏ తప్పు చేసిన పట్టించుకోరని స్థానికులు చెబుతున్నారు.
రసాయన కంపెనీలు విడుదల చేసే వ్యర్ధాలను తిని 11 గొర్రెలు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పీఠంపల్లి గ్రామంలో జరిగింది. పీఠంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మెట్టు లింగయ్య తన గొర్రెలను తోలుకొని మేతకు వెళ్లాడు. కాగా గ్రామ పరిధిలోని రసాయన కంపెనీలు వదిలేసే విషపూరిత వ్యర్థాలను అక్కడి గుట్టల ప్రాంతంలో పారబోయడం వల్ల గొర్రెలు వాటిని తిని అక్కడికక్కడే 11 గొర్రెలు మృతి చెందగా మరో 50 గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయి అని అవి కూడా మేత మేయడం లేదని ఆ రైతు వాపోతున్నారు. రసాయన కంపెనీల యాజమాన్యాలు విషపూరిత వ్యర్థాలు బ్యాగులలో నింపి విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ వదిలేయడంతో వాటిని తిన్న మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. రసాయన కంపెనీలు విడుదల చేసే విషపూరిత వ్యర్ధాలను పరిసర ప్రాంతాల్లో వదిలేయకుండా కంపెనీ ఆవరణలోనే నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకోవాలి. అవి రసాయన ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలించాలి కానీ అలా కాకుండా కంపెనీ యాజమాన్యం విషపూరిత రసాయనలను పరిసర ప్రాంతాల్లో వదిలివేయడం వల్ల పర్యావరణం క్షీణించి వన్యప్రాణులే కాకుండా ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో చుట్టు పక్కల ఉన్న ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు ఇస్టారీతిలో ఎక్కడపడితే అక్కడ రసాయన వ్యర్ధాలు పారబోస్తున్నారని, ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుని తమకు తగిన న్యాయం చేయాలని గొర్రెల కాపరులు, గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. గత నెల చివరలో జరిగిన ఈ సంఘటన ఈ నెల 5న బయటకు రావడం జరిగింది. రసాయన వ్యర్ధాలు పారబోసిన పరిశ్రమను గుర్తించి కూడా దానిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఏదో తు తు మంత్రంగా డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చి ఆ పరిశ్రమను వాడివేయడం వెనుక పిసిబి అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు అందాయని అందుకే ఆ పరిశ్రమపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నష్టపోయిన రైతుకు ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇప్పించలేదని కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని బాధితుడు, స్థానిక రైతులు, పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.