హెటిరో కాలుష్య పరిశ్రమను మూసివేయండి

  • పీసీబీ ఉన్నతాధికారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • నల్లకుంట చెరువును కాలుష్య కోరల నుంచి కాపాడాలి
  • పీసీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు, పర్యావరణ వేత్తలు ఆగ్రహం
  • జీవించే హక్కును కాపాడాలంటూ గొంతెత్తిన మహిళలు
  • కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన
  • నల్లకుంట చెరువు కలుషితం కారణమైన హెటిరో ఫార్మాను మూసివేయాలి

తమ ఊరిని నాశనం చేస్తున్న కాలుష్య పరిశ్రమలపై దోమడుగు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో యూనిట్ – 1 పరిశ్రమ నల్లకుంట చెరువులోకి విషపూరిత రసాయనాలు వదలడంతో చెరువు నీరంతా కాలుష్యమై ఎర్రబారిన విషయంపై గ్రామస్తులు కదం తొక్కారు. ఇప్పటికైనా.. దోమడుగు గోస వింటారా అంటూ ఆ గ్రామ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పీసీబీ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెటిరో ఫార్మా పై చర్యలు తీసుకోకపోవడం వెనుక పీసీబీ ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున లంచం ముట్టిందని అందుకే ఆ పరిశ్రమ ఎంత కాలుష్యం చేసిన పీసీబీ అధికారులు పట్టించుకోడం లేదని.. వారి నిర్లక్ష్య వైఖరిపై గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. జీవించే హక్కును కాపాడాలంటూ గ్రామంలోని అమర వీరుల స్థూపం నుంచి ప్రధాన వీధుల గుండా కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ హక్కులను హరించొద్దని మహిళలు గొంతెత్తారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. నల్లకుంట చెరువు కలుషితానికి కారణమైన హెటిరో ఫార్మా కంపెనీ యూనిట్ -1 పరిశ్రమను తక్షణమే మూసివేయాలనిమ లేకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమని హెచ్చరించారు.

చనిపోయిన మూగజీవాల సాక్షిగా పోరాటం..
గ్రామంలోని నీటి వనరులు, భూగర్భజలాలను కలుషితం చేస్తూ, తమకు అన్ని విధాలుగా నష్టం చేకూర్చుతున్న కాలుష్యకారక కంపెనీలకు వ్యతిరేకంగా దోమడుగు ప్రజలు చైతన్యం చాటారు. నల్లకుంట చెరువు పూర్తిగా విషతుల్యం కావడంతో కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తున్నా ఎవరూ స్పందించకపోవడంతో అందరూ ఏకమయ్యారు. శనివారం స్థానికులంతా కలిసి, వివిధ ప్రజా సంఘాల మద్దతుతో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాలుష్యానికి వ్యతిరేకంగా నినదించారు. కాలుష్య జలాల కారణంగా చనిపోయిన దూడల బొమ్మలను ఊరేగింపులో ప్రదర్శించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, తమ ఊరికి తీవ్ర నష్టం చేస్తున్న కాలుష్య కారక కంపెనీలపై చర్యలు తీసుకోవాలని నినదించారు. కనీసం తమ గ్రామంలో పండిన బియ్యం కూడా ఎవరూ కొనడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దోమడుగు బియ్యం అని చెబితేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

బొక్కలు అరిగిపోతున్నాయ్…
కలుషిత జలాల వల్ల బోర్లలోను నీళ్లన్నీ కలుషితం అయ్యాయని మహిళలు పేర్కొన్నారు. చిన్నపిల్లల బొక్కలు సైతం అరిగిపోతున్నాయని, డాక్టర్ల వద్దకు వెళ్తే తాగుతున్న నీళ్లే కారణమని చెబుతున్నారని వివరించారు. తమ ఆరోగ్యాలు పాడైపోతున్నాయని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతమైన ఘాటైన వాసనల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో కనీసం చుట్టాలు కూడా తమ ఇండ్లకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లను తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని బాధితులు కొందరు కన్నీటి పర్యతం అయ్యారు. కాలుష్యకారక కంపెనీ హెటిరోను మూసివేయని పక్షంలో, తమ నిరసనను కొనసాగిస్తామని గ్రామస్తులు నినదించారు. ఇంత జరుగుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా కంపెనీ యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్న పీసీబీ అధికారుల తీరును ఎండగట్టారు. అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీరా సంఘమిత్ర, జాతీయ నాయకురాలు, టీపీజేఏసీ నాయకులు రాజగోపాల్ రెడ్డి, ముత్యాలు, శ్రీనివాస్, ప్రజా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధులు దీప్తి, హేమంత్, విజయలక్ష్మి, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ మంగయ్య, సభ్యులు బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వేచ్ఛ రెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీధర్, ఎల్లారెడ్డి, మురారి మధుకర్, సత్తిరెడ్డి, కిష్టారెడ్డి, బాలు గౌడ్, ఎం.యాదగిరి, పి. శంకరయ్య, బొంది వెంకటేష్, జయమ్మ, స్వప్న, శారద తదితరులు పాల్గొన్నారు.

ఐక్యంగా ఉంటే విజయం సాధిస్తాం
కాలుష్యకారక కంపెనీలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. స్థానికులంతా ఐక్యంగా ఉంటే.. కచ్చితంగా ఈ పోరాటంలో విజయం సాధిస్తాం. బలవంతులైన వ్యక్తులతో మనం పోరాటం సాగించాల్సి ఉంటుంది. దీనికోసం అందరూ సన్నద్ధం కావాలి. మన బలాన్నిపెంచుకుంటూ పోరాటాన్ని ఉదృతం చేయాలి. దోమడుగులో ఉన్న ప్రజలందరినీ ఈ పోరాటంలో భాగస్వాములను చేయాలి. అలా చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించుకునేలా ముందుకు సాగాలి. ర్యాలీలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఇది మంచి పరిణామం. కన్నెగంటి రవి, టీపీజేఏసీ స్టేట్ కోకన్వీనర్

సహజ వనరులను కాపాడుకోవాలి
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలి. కెమికల్ కంపెనీలు విడుదల చేస్తున్న రసాయన జలాలతో చెరువులు, భూగర్భజలాలు కాలుష్య కారకంగా మారుతున్నాయి. కాలుష్యాన్ని అరికట్టాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు కాసులకు మరిగారు. ప్రజలు చైతన్యం అవుతూ ఉద్యమాలతో సహజ వనరులను కాపాడుకోవాలి. పి.శంకర్, డీబీఎఫ్, జాతీయ కార్యదర్శి

పరీక్షల్లో తీవ్రస్థాయిలో కలుషితం
ఇటీవల అధికారులు నల్లకుంట చెరువు నీటి నమూనాలను తీసుకెళ్లారు. వాటి పరీక్ష ఫలితాలను గమనిస్తే, తీవ్రస్థాయిలో చెరువు నీళ్లన్నీ కలుషిత మైనట్టు స్పష్టమైంది. అవినీతి వ్యవస్థల కారణంగా సంబంధిత కంపెనీపై ఎలాం టి చర్యలు తీసుకోలేదు. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య కారక కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తమ ఊరికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు దోమడుగు వాసులు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. డాక్టర్ కలపాల బాబూ రావు, సీనియర్ శాస్త్రవేత్త

పోరాటం కొనసాగిద్దాం
దిలావర్పూర్ లో విత్తనాల ఫ్యాక్టరీ స్థాపనకు వ్యతిరేకంగా వేలాదిమంది మహిళలు కదిలి వచ్చారు. పరిశ్రమ తమకు వద్దే వద్దంటూ పెద్ద ఎత్తున పోరాటం సాగించారు. రోజుల తరబడి ఉద్యమాన్ని కొనసాగించారు. ఐక్యంగా కొట్లాడారు. వారి పోరాటంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకుంది. దోమడుగులోనూ ఆ స్థాయిలో చైతన్యం చాటాలి. ఆ పోరాట స్ఫూర్తిగా, కాలుష్యకారక కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా పోరాటం కొనసాగించాలి. దోమడుగు ప్రజలు సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి. టి.అశోక్ కుమార్, టీపీజేఏసీ జిల్లా కన్వీనర్