షాద్ నగర్ సాంఘిక సంక్షేమ శాఖ కాలేజిని ఆకస్మికంగా సందర్శించిన చిన్నారెడ్డి

  • కాలేజీ దుస్థితి, ప్రిన్సిపాల్ వ్యవహారంపై సీఎంకు త్వరలో నివేదిక అందిస్తా
  • విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన చిన్నారెడ్డి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల స్థితిగతులపై, ప్రిన్సిపాల్ వ్యవహారంపై సమగ్రంగా నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి త్వరలోనే అందించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. సోమవారం షాద్ నగర్ లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ కాలేజిని చిన్నారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ప్రిన్సిపాల్ వైఖరిని నిరసిస్తూ నిన్న 400 మంది విద్యార్థినిలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో చిన్నారెడ్డి గురుకుల కాలేజీని సందర్శించారు. విద్యార్థినుల పట్ల కళాశాలలో ప్రిన్సిపల్ శైలజ ప్రవర్తించిన తీరును, ఇతర వివరాలు సిబ్బంది, విద్యార్థినులను చిన్నారెడ్డి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. కాలేజీలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలేజీ ప్రాంగణం అంతా కలియ తిరిగారు. వాష్ రూమ్స్, తరగతి గదులు అధ్వన్నంగా ఉన్న విషయాన్ని, ఇతర సమస్యలు సీఎంకు ఇచ్చే నివేదికలో ప్రస్తావిస్తానని చిన్నారెడ్డి తెలిపారు.