కొల్లూరు కాల‌నీవాసుల‌కు 24గంట‌ల్లో హామీలు నెర‌వేర్చాం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • త్వ‌ర‌లో మ‌రిన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం
  • కాంగ్రెస్ పాల‌న‌కు ఇది నిద‌ర్శ‌నం
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : కొల్లూరు కాల‌నీ వాసుల‌కు వారం రోజుల క్రితం ప్ర‌భుత్వ ప‌క్షాన ఇచ్చిన హామీల‌ను 24 గంట‌లు తిర‌క్క‌ముందే అమ‌లు చేయ‌డం ప్రారంభించామ‌ని ఇది ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాల‌నాద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు కాల‌నీలో సుమారు 16 వేల కుటుంబాలకు చెందిన 48 వేల‌కు పైగా ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నారు. వారం రోజుల క్రితం ఈ కాల‌నీని సంద‌ర్శించిన మంత్రి పొంగులేటి , ఇత‌ర మంత్రుల ఇచ్చిన హామీ నేప‌ధ్యంలో ఆదివారం నాడు మ‌రో స‌మావేశం నిర్వ‌హించారు స‌మావేశంలో సహచర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్,ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ్ సహాయం రఘుకుమార్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి & nbsp; కౌన్సిలర్ భరత్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కొల్లూరు 2 బిహెచ్‌కే కాల‌నీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంద‌ని వారం రోజుల క్రితం ఇచ్చిన మాట ప్రకారం కాలనీ వాసుల చాలా సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించామ‌ని వివ‌రించారు. కాల‌నీలో సన్నబియ్యం తీసుకునే లబ్ధిదారుల కోసం రేషన్ షాపు, కాలనీలోపలకి ఆర్టీసీ బస్సులు వచ్చేలా ఏర్పాటు చేశామ‌న్నారు. కాలనీవాసుల రక్షణ కోసం శాశ్వత పోలీస్ స్టేషన్ నిర్మాణం నిర్మాణం చేపట్టాం. అంతేగాక 24 గంటల్లోనే తాత్కాలికంగా ఔట్ లెట్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. గతంలోనే ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. అత్యవసర కోసం రెండు అంబిలెన్స్ లను అందించామ‌ని తెలిపారు. కాల‌నీలో స్పీడ్ బ్రేకర్లు, సెంట్రల్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేస్తామ‌ని , శ్మ‌శాన‌వాటిక ఏర్పాటుకు చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయ‌ని తెలిపారు. కాలనీలో అరులైన పేదలందరికీ గృహ జ్యోతి పధకం కింద 200 వరకు యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తామ‌ని వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ తీసుకునే విధంగా వచ్చే నెల నుంచి ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. కాల‌నీలో షాపుల‌ ఏర్పాట్లకు త్వరలో టెండర్లు పిలుస్తామ‌ని చెబుతూ మ‌రిన్ని అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలంటే కాలనీవాసులు కమిటీని వేసుకోవాల‌ని మంత్రి పొంగులేటి పున‌రుద్ఘాటించారు.