గురుకులాల బకాయిలు, మధ్యాహ్న భోజనం బకాయిలు 163 కోట్లు వెంటనే విడుదల చేయండి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు 163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో, ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టల్లు, ఇతర సంస్థలకు సంబంధించిన డైట్, అద్దె, కాస్మోటిక్స్ బకాయిలకు సంబంధించిన 51.36 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని మైనారిటీ గురుకులాలు మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకాయిలు 47.61 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 63.92 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో , వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200 పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్వహకులు నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించేందుకు అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం సందర్శించాలని సూచించారు. అధికారుల సందర్శనకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు నిర్వాహకులు నివేదించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.