అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • నాణ్యతతో రాజేపడేది లేదు
  • తేడా వచ్చిన ఉపేక్షించేది లేదు

శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుదవారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంకు హెలికాప్టర్ లో 11 గంటల 30 నిముషాలకు చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి, ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. శబరిష్ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

అనంతరం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ లు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను మంత్రులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రులు మేడారం హరిత కాకతీయ హోటల్ లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ లతో కలసి సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదార్లతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ మేడారంలో కోనసాగుతున్న అభివృద్ధి పనులపై, ప్రాకారం లోపల,సివిల్ పనులు, గద్దెల ఎత్తు పెంచడం, నిర్మాణం , ప్రధాన ద్వారాలు, ఆర్చ్, 4 వాచ్ టవర్లు, ప్రాకారనికి చుట్టూ సిసి రోడ్డు పనులను సమాంతరంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. దీనికితోడుగా గ్రీనరీ, ప్లాంటేషన్ చేయాలన్నారు. కావలసిన గ్రానైట్ వేగవంతంగా తెప్పించుకోవాలని అన్నారు.
మెన్ మెటీరియల్ పెంచి 24 గంటలు పనులు జరగాలన్నారు. మేడారం లో రోడ్డు నిర్మాణ పనులు డివైడర్లు, ప్లాంటేషన్ తో సహా నెల రోజుల్లో పూర్తి కావాలి. మాస్టర్ ప్లాన్ లో భాగంగా మొదటి విడతలో క్యూ లైన్ షేడ్స్, 4 రోడ్డు లైన్ల విస్తరణ, టెంపర్ అభివృద్ధి, గద్దెల వద్ద భక్తుల కెపాసిటీ 3 వేల నుండి 10 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. 19 ఎకరాలు భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కోరిన విధంగా
జంపన్నవాగుపై చెక్ డ్యామ్ ల ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. శాశ్వత బస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించాలని, పర్యాటక శాఖ ద్వారా జంపన్నవాగు అభివృద్ధి, సుందరికరణ ప్రతిపాదనలు సిద్ధం చెయాలన్నారు. పశు సంవర్థక శాఖ ద్వారా 4 అధునాతన పశు వదశాలల ఏర్పాటు చేయాలని తెలిపారు. మేడారం చుట్టుప్రక్కల రహదారులకు మరమ్మతులు చేయాలి. మేడారం కు వచ్చే ప్రధాన రహదారిలో ఎలాంటి అడ్డంకులు ఉండకుండా ప్రధాన రహదారిలో అక్కడక్కడ మిగిలి ఉన్న పనులతో పాటు మల్లంపల్లి బ్రిడ్జి, కటాక్షపూర్ బ్రిడ్జి పై ప్రత్యేక శ్రద్ధ చూపి డిసెంబర్ 15 లోగా పూర్తి కావాలని నేషనల్ హై వే అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఈ నెల 22 న వస్తామని, నిర్దేశిత ఆయా పనులు పూర్తి కావాలని అన్నారు. నాణ్యతతో రాజేపడేది లేదని, తేడా వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హారీష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బి, పి ఆర్ ఈ ఎన్ సి, ఆర్డీఓ వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులను పూర్తి చేస్తామని, గిరిజన పూజార్ల సూచన మేరకే పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని అన్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే రెండు వందల సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, 25 రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, భవిష్యత్ లో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేడారం మాస్టర్ ప్లాన్ పై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఎంత డబ్బు ఖర్చు అయినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, అన్ని పనులను పూర్తి చేసి రానున్న మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, గతంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను నేటి ప్రజా ప్రభుత్వం చేస్తున్నదని వివరించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్ర పండుగగా గుర్తించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించాలని
కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ధేశించిన సమయంలో సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏ. లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మ వాళ్ళను దర్శించుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ దేవుళ్ళ ప్రాంతాలలో గిరిజనుల సాంప్రదాయ పద్ధతి ప్రకారమే గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, గిరిజనుల అస్తిత్వం,ఆత్మగౌరవానికి విలువలు ఇస్తూనే పనులు చేపడుతున్నట్లు , మరో వారం రోజుల్లో గా గద్దెల ప్రాంతం ఒక రూపానికి వస్తుందని వివరించారు. భక్తులు విశ్వాసం నమ్మకంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారని, వారి విశ్వాసం దెబ్బ తినకుండా ఆదివాసీల అస్తిత్వం కాపాడుకుంటూ పనులు పూర్తి చేస్తామని అన్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతరం సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హారీష్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు బయలుదేరారు.