సచివాలయంలో ఒకేసారి 134 మంది ఏఎస్ఓల బదిలీ

  • ఉన్నతాధికారుల బదిలీలు జరిగిన ఏడాదికి నిర్ణయం

సచివాలయంలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. కింది స్థాయిలోని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్ఓ)లను పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే శాఖలో ఏఎ్‌సవోలు తిష్ఠ వేశారంటూ గతంలో పలు వార్తలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం.. తాజాగా 134 మంది ఏఎ్‌సవోలను ఒకేసారి బదిలీ చేసింది. దీంతో 12 ఏళ్లకు పైగా ఒకే శాఖలో పని చేస్తున్న ఏఎ్‌సవోలకు సైతం స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 134 మందిని సచివాలయంలోని ఒక శాఖ నుంచి మరో శాఖకు మారుస్తూ ఒకే జీవోను జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), వ్యవసాయం, పశు సంవర్థక, బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, అడవులు, విద్యుత్తు, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, హోం, సాగునీటి పారుదల, పరిశ్రమలు, కార్మిక, పురపాలక, మైనారిటీల సంక్షేమం, ప్రణాళిక, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, ఎస్సీ అభివృద్ధి, రవాణా, గిరిజన, మహిళా సంక్షేమం, యువజన సర్వీసుల శాఖల నుంచి ఏఎ్‌సవోలు బదిలీ అయ్యారు. బదిలీ అయితే ఏఎ్‌సవోలలో ప్రధానంగా జీఏడీ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఒక్క శాఖ నుంచే ఏకంగా 28 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయంలో ఉన్నత స్థాయి పోస్టుల బదిలీలను ప్రభుత్వం గతేడాదే చేపట్టింది. అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఉప కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సెక్షన్‌ ఆఫీసర్‌ వరకు బదిలీలు జరిగాయి. కానీ, కింది స్థాయిలోని ఏఎ్‌సవోలను బదిలీ చేయలేదు. వాస్తవానికి ఒకే శాఖలో నాలుగేళ్ల సర్వీసు దాటిన వారిని బదిలీ చేయాలన్న నిబంధనలున్నాయి. అయినా కొంత మంది ఒకే చోట 7, 8 ఏళ్లుగా పని చేస్తున్నారు. విద్యాశాఖలో 12 ఏళ్ల నుంచి ఒకేచోట పని చేస్తున్నవారు కూడా ఉండడం గమనార్హం. అయినా.. ప్రభుత్వం గతేడాది వీరి జోలికి వెళ్లలేదు. తాజాగా ఇలాంటి వారందరికీ స్థానచలనం కల్పించింది.