మీడియా స్వేచ్ఛ, అదుపుకు స్వచ్ఛందంగా పనిచేసే ప్రెస్ కౌన్సిల్ అవసరం: సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్

మీడియా స్వేచ్ఛ తోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు అత్యంతఆవశ్యకమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, సమాజంలో మీడియా పేరుతో జరుగుతున్న దుష్టప్రయోగాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసారు. వర్కింగ్ జర్నలిస్టులు, వార్తా పత్రికలు, చట్టాలు ఏలా రూపొందించాలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ సూచనల మేరకు దేశంలో మొదటి ప్రెస్ కమీషన్ తోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966 నవంబర్ 16న ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సి ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) నిర్వహించుకోవడం ఆనావాయితిగా వస్తుందన్నారు. అందులో భాగంగా నేడు మనం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆందరం ఒకే వేదికపె కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా అందరికి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని పత్రికలు, ఛానాల్స్ యాజమాన్యాలు మీడియా చట్టాలు, నైతిక నియామావళిని పాటించకపోవడం వలన, తప్పుడు వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల మీడియా మొత్తాన్ని దూషిస్తున్నారు. దీనిని అరికట్టాలంటే మీడియా సంస్థలు, సంఘాలు అన్ని ఒక తాటిపై వచ్చి మనపై ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా సోషల్ మీడియా నియంత్రణకు చట్ట పరంగా సరియైన మార్గదర్శకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని ఆయన కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం తరుపున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియా కౌన్సిల్ ఇండియా మార్చే విధంగా అన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, మీడియా అకాడమి కృషి చేయాలన్నారు. గత రెండేళ్లుగా భారత ప్రెస్ కౌన్సిల్ కు పాలక వర్గాన్ని నియమించలేదని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీని ద్వారా పత్రికా స్వెచ్ఛ, నైతికత, జవాబుదారితనం, బాధ్యతలు మొదలగునవి పర్యవేక్షిస్తూ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తప్పు చేస్తే మీడియాపై చర్యలు తీసుకునే అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మారుతి సాగర్, మాజీద్, బసవ పున్నయ్య, రమణారావు, రంగసాయి, యూసుఫ్ బాబు, రమణ కుమార్, సువర్ణ, తదితరులు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి తమ సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ అధ్యక్షత వహించగా, జాయింట్ డైరెక్టర్ కే. వెంకట రమణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, అధికారులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.