లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కి ఏసీబీ అధికారులకు దొరకకుండా పారిపోతున్న ఎస్సైని వెంటబడి పట్టుకున్న ఏసీబీ అధికారులు

  • పటాకులు కాల్చిన స్థానికులు..

టేక్మాల్ మండల పరిధిలో ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వారి నుంచి తప్పించుకుని పారిపోవడంతో సినీ ఫక్కీలో ఛేజించి ఎస్సై రాజేశ్‌ను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీని దొంగిలించిన విషయంలో కేసును మాఫీ చేసేందుకు కాంప్రమైజ్ చేయడానికి ఎస్‌ఐ రాజేశ్‌ ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 13వ తేదీన సదరు వ్యక్తి ఫోన్ ద్వారా రూ.10 వేలు చెల్లించాడు.

మిగతా డబ్బులు రూ.30 వేలను పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐకు ఇచ్చాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎస్‌ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో.. ఎస్‌ఐ రాజేశ్‌ వారితో పెనుగులాడి వారి నుంచి తప్పించుకుని మెట్ల ద్వారా పోలీస్ స్టేషన్ పైకి ఎక్కాడు. ఏసీబీ అధికారులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పోలీస్ స్టేషన్ భవనం నుంచి కిందకు దూకాడు. అక్కడి నుంచి టేక్మాల్ చిన్న చెరువు నుంచి వ్యవసాయ పంట పొలాల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించాడు.

సుమారుగా రెండు కిలోమీటర్ల మేరకు అరగంటకుపైగా సినీ ఫక్కిలో ఛేజింగ్ కొనసాగింది.. చివరికి టేక్మాల్ మార్కెట్ సమీపంలోని పంట పొలాల వద్ద ఎస్‌ఐ రాజేశ్‌ అధికారులకు చిక్కాడు. ఒకానొక సందర్భంలో తన వద్ద ఉన్న డబ్బులను పారవేయడానికి సైతం ప్రయత్నించాడు. ఏసీబీ అధికారులు తీవ్రంగా శ్రమించి ఎస్సైని పట్టుకుని టేక్మాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ విచారణ చేపట్టిన అధికారులు ఎస్‌ఐను కోర్టుకు తరలించారు.

పటాకులు కాల్చిన స్థానికులు..
ఎస్‌ఐ రాజేశ్‌ ఏసీబీ అధికారులకు చిక్కడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్‌ఐ అవినీతి, ఆగడాలకు విసిగిపోయిన ప్రజలు పటాకులు కాల్చి సంబరాలను చేసుకున్నారు. సామాన్య ప్రజలు సైతం ఏదో ఒక సందర్భంగా ఎస్‌ఐ వల్ల అకారణంగా వేధింపులకు గురైనవారే కావడంతో ఎస్‌ఐ పీడ విరగడైందని పటాకులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత పదేళ్ల క్రితం ఇదే విధంగా ప్రదీప్ కుమార్ అనే ఎస్‌ఐ లంచం తీసుకుంటూ పట్టుబడటంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అప్పుడు కూడా ప్రజలు పటాకులు కాల్చి సంబరాలను చేసుకున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ అదే సంఘటన పునరావృతం అయ్యింది.