భారత్, రష్యాలది దశాబ్దాల స్నేహం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • వ్యవసాయం, విద్యుత్తు, డిఫెన్స్, సహకార బ్యాంకు రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం
  • రష్యా బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా బృందం ఆసక్తి చూపడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఆసక్తిని కనబరుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ప్రజాభవన్లో ఆయన గ్లోబల్ ట్రేడ్ మరియు టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (GTTCI ), VTB రష్యన్ బ్యాంక్ ప్రతినీలతో చర్చించారు. వ్యవసాయం, విద్యుత్తు, టెక్నాలజీ రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని డిప్యూటీ సీఎం రష్యా ప్రతినిధి బృందానికి సూచించారు. ఒక సీజన్ లో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. ఫార్మా, ఐటీ రంగాలకు హబ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిన విషయాన్ని లెక్కలతో డిప్యూటీ సీఎం వివరించారు. మైనింగ్ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని 100 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, 45 వేల మంది ఉద్యోగులతో కొనసాగుతున్న విషయాన్ని వివరించారు. సింగరేణి సంస్థ విస్తరణ లో భాగంగా క్రిటికల్ మినరల్ మైనింగ్ దిశగా ముందుకు పోతున్న విషయాన్ని వివరించారు. డిఫెన్స్ రంగంలోనూ హైదరాబాద్ దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం లాంటిది ఇక్కడ మంచి వాతావరణం, పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూమి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు, మంచి నైపుణ్యం ఉన్న తక్కువ ధరకు లభించే మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని డిప్యూటీ సీఎం రష్యా బృందానికి తెలిపారు. 1940 నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతుందని, వ్యూహత్మకంగా హైదరాబాద్ సురక్షిత ప్రాంతమని తెలిపారు. దృఢమైన సహకార బ్యాంకు వ్యవస్థలో టెక్నాలజీ, పెట్టుబడులకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. మా శాఖల అధికారులతో కూర్చుని చర్చించి మెరుగైన ఒప్పందాలు జరిగేలా ముందుకు వెళ్లాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్, మూడు ట్రిలియం డాలర్ల ఎకానమీ లక్ష్యసాధన, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మూసి పునర్జీవనం వంటి ప్రణాళికలను రష్యా బృందానికి డిప్యూటీ సీఎం వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రష్యా బృందానికి శుభాకాంక్షలు తెలియజేయాలని వివరించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ప్రతినిధి బృందంలో వోల్గా భాష, రష్మీ సలూజ, సంజయ్ కౌశిక్, మోనికా bhanot తదితరులు పాల్గొన్నారు.