- జెరియాట్రిక్ సేవలు విస్తరించాలని సూచించిన మంత్రి దామోదర్
- డీఎంహెచ్‌వోలు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో సమీక్ష
- అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వృద్ధుల వివరాలతో జాబితాలు సిద్ధం చేసుకోవాలని డీఎంహెచ్‌వోలకు సూచన
దేశంలో.. రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో జెరియాట్రిక్ సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ.. జీవన ప్రమాణాలు పెరిగాయని, దీంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతున్నదన్నారు. పిల్లల కోసం మనం ప్రత్యేకంగా చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగానే, జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం భవిష్యత్తులో మన దేశంలోనూ ఏర్పడుతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు. ప్రతి జీజీహెచ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో ఇప్పటికే జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల జాబితాలు సిద్ధం చేసుకుని, వారికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డీఎంహెచ్‌వోలదేనని మంత్రి ఆదేశించారు.
డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్ల అటెండెన్స్‌ను మేము మానిటర్ చేస్తున్నాం
గత ప్రభుత్వం తరహాలో హాస్పిటల్, మెడికల్ కాలేజీ పేరిట అరకొర బిల్డింగులు కట్టి వదిలేయడం లేదు. ప్రతి హాస్పిటల్‌లోనూ అవసరమైనమేర డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని నియమిస్తున్నాం. ఈ రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం.. మరో 7 వేలకుపైగా పోస్టులు భర్తీ అవుతున్నాయి. మ్యాన్ పవర్‌తో పాటు మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు సర్వీస్ చేయడం మీ చేతుల్లోని ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్లు మీవి మీరు వాటిని ఓన్ చేసుకుని కాపాడుకోవాలి.. అక్కడికి వచ్చే పేషెంట్లకు మంచి సర్వీస్ అందించి రక్షించుకోవాలి. డీఎంహెచ్‌వోలు, హాస్పిటల్ సూపరింటెండెంట్ల అటెండెన్స్‌ను మేము మానిటర్ చేస్తున్నాం. మీ సిబ్బంది అటెండెన్స్‌ను మీరు మానిటర్ చేస్తున్నారో లేదో కూడా చేస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఎంతటివారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో మంచిగా పని చేసే వారికి అండగా నిలుస్తాం. హాస్పిటళ్లలో పాతుకుపోయి, పని చేయించే ఆఫీసర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, వార్తలు రాయించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిద్దాం. వారి వివరాలను మీ హెచోడీలకు అందించండి. మీరు చేసిన పర్యటనలు, తనిఖీలు, ఫైండింగ్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ప్రతి నెలా అందించాలి.
“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన వైద్య వ్యవస్థ కూడా మారాలి.. మార్చే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు కమ్యునికెబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి.. ఇప్పుడు నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్.. లైఫ్‌స్టైల్ డిసీజెస్ ఎక్కువయ్యాయి. మన హాస్పిటళ్లను కూడా బీపీ, షుగర్, కేన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు లైఫ్‌స్టైల్ డిసీజ్‌లకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందించే విధంగా తయారు చేసుకుంటున్నాం.
- అన్ని జిల్లాల్లో ఎన్‌సీడీ క్లినిక్‌లు ప్రారంభించుకున్నాం
- డే కేర్ కేన్సర్ సెంటర్లు పెట్టుకున్నాం
- ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం
- ఇప్పుడు జెరియాట్రిక్ సేవలు విస్తరించుకుంటున్నాం
- భవుష్యత్తులో ఈ సేవలన్నింటినీ మరింత విస్తరించుకుంటూ ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్లలోనే మెరుగైన వైద్య సేవలు అందిద్దాం.”
- పేషెంట్లను దోచుకునే హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోండి
ట్రీట్‌మెంట్ పేరిట ప్రజలను దోచుకునే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠినంగా వ్యవహరించండి. ఐవీఎఫ్ సెంటర్లు, పెయిన్ క్లినిక్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్ల పేరిట దోపిడీకి, అవకతవకలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించండి. మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, పబ్లిక్ హెల్త్, ఎన్‌హెచ్‌ఎం డిపార్ట్‌మెంట్ల నడుమ కోఆర్డినేషన్ ఉండాలి. ఎక్కడికి అక్కడ సమన్వయ కమిటీలను నియమించుకుని పని చేయండి. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ పకడ్బంధీగా అమలు చేయాలి. పోలీసులను చూడగానే నేరస్తులు భయపడినట్టు, మిమ్మల్ని చూస్తే నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల యాజమాన్యాలు భయపడాలి. కొన్ని జిల్లాల్లో సిజేరియన్ డెలువరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని తగ్గించి నార్మల్ డెలివరీలను ప్రోత్సహించండి. సిజేరియన్ డెలివరీలు మాత్రమే చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై దృష్టి సారించండి. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి పేషెంట్లను బయటకు రిఫర్ చేయొద్దని మంత్రి అన్నారు. సబ్ సెంటర్ నుంచి జీజీహెచ్ల వరకూ అన్ని హాస్పిటళ్ల నడుమ సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్‌ను అవసరమైనప్పుడు మరో ప్రభుత్వ హాస్పిటల్‌కు మాత్రమే రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందించాలన్నారు.