- నాబార్డ్ భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మలుస్తోంది
- గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్దశక్తి నాబార్డ్
- 21వ శతాబ్దానికి అనువైన సంస్థలను తెలంగాణ నిర్మిస్తుంది
- వ్యవసాయంలో ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విలాసం కాదు నేడు అది అవసరం
- నాబార్డ్ ఎర్త్ సమ్మిట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన మాదాపూర్ లోని హైటెక్స్ లో ఏర్పాటుచేసిన నాబార్డ్ మొదటి ఎర్త్ సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోనే అతి పెద్ద రుణమాఫీలలో ఒకదాన్ని అమలు చేసి, దాదాపు 22 లక్షల కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల ఉపశమనం అందించాం అన్నారు. కొనుగోలు వ్యవస్థను విస్తరించి పారదర్శకంగా మార్చాం, రైతులకు నేరుగా, సమయానుసారం మద్దతు అందుకునేలా రైతు భరోసా అమలు చేస్తున్నాం అనే డిప్యూటీ సీఎం వివరించారు.
సాగునీరు, డిజిటల్ పంట రికార్డులు, కోత తర్వాతి మౌలిక వసతులలో పెట్టుబడులతో గ్రామీణ కుటుంబాల్లో బలమైన నమ్మకాన్ని పునరుద్ధరించాం అని తెలిపారు. సంక్షోభ సమయాల్లోనే కాదు, రైతుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్రభుత్వం తోడుగా ఉంటుంది ఇది మా నిబద్ధత ఇది అన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ EARTH సమ్మిట్‌లో పాల్గొనడం నాకు లభించిన గొప్ప గౌరవంగా అన్నారు. ఈ సమ్మిట్ పేరు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. భారతదేశ బలం చివరకు దాని నేలలోనే ఉంది, దాని గ్రామాలలో ఉంది, మన రైతుల్లో ఉంది, ప్రతికూలతను సమృద్ధిగా మార్చే వారి నిశ్శబ్ద ధైర్యంలో ఉందన్నారు. ఈ జాతీయ కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభం కావడం చాలా సముచితం. దూరదృష్టి కలిగిన జాతీయ నాయకులు నిర్మించిన సంస్థల పునాదిపై ఈ నగరం ఎదిగింది అని తెలిపారు. వ్యవసాయం గురించి మనం మాట్లాడినప్పుడు, సంస్థాగత విప్లవం లేకుండా ఏ గ్రీన్ రేవల్యూషన్ కూడా సాధ్యం కాదని గుర్తు చేసుకోవాలి, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న నాయకులు మన దేశానికి లభించటం ఒక వరం అని వివరించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ “మిగతా అన్నీ ఆగొచ్చు, వ్యవసాయం ఆగకూడదు” అనే నమ్మకంతో
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సాగునీటి సంఘాలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు
వంటి వ్యవస్థాగత నిర్మాణాన్ని సృష్టించారు అని తెలిపారు. ఇందిరా గాంధీ ముఖ్యంగా గ్రీన్ రేవల్యూషన్ కాలంలో ఆమె చూపిన ధైర్యం రైతుకు భారత ప్రభుత్వ సంపూర్ణ అండ లభించేలా చేసిందన్నారు. మన ప్రాంతానికి చెందిన డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్, గ్రామీణ ఆరోగ్య వసతులు, SHGs కు మద్దతు వంటి రైతు-కేంద్రీకృత సంక్షేమ నమూనాతో దయ, అభివృద్ధి రెండూ కలిసిపోవచ్చని నిరూపించారు అన్నారు. ఇవాళ నాబార్డ్ ఎదుట నిలుచుని చూస్తుంటే భారత అభివృద్ధి కథలో పెద్ద భాగం అనేది సంస్థలను నిర్మించిన కథ అని మరలా గుర్తొస్తుంది అన్నారు. ఆ జాతి నిర్మాణ కాలంలో పుట్టి, శాంతిగా పనిచేస్తూ నిలిచిన గొప్ప సంస్థల్లో నాబార్డ్ అత్యుత్తమమైనదిగా నిలిచింది అని డిప్యూటీ సీఎం తెలిపారు. నాబార్డ్ ఎప్పుడూ ప్రచారం కోసం పోరాడిన సంస్థ కాదు కానీ నాబార్డ్ లేకపోతే గ్రామీణ భారత్ ఇవాళ ఇలా ఉండేది కాదు అన్నారు. PACs ఆధునికీకరణ, సహకార సంస్థల బలోపేతం, వ్యవసాయ డిజిటలైజేషన్, FPOలకు సుస్థిర శక్తి ఇవ్వడం… గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు.
నిన్న ఎవరో నన్ను అడిగారు: “సార్… నాబార్డ్ విజయ రహస్యం ఏమిటి?”
నేను నవ్వుతూ చెప్పాను: “చాలా సింపుల్. వీళ్ళు డ్రామా చేయరు… డెలివర్ చేస్తారు.” అని ఉదహరించారు. ఈ సమ్మిట్ కూడా అదే ఆత్మను ప్రతిబింబిస్తోంది అన్నారు.
ఈ EARTH సమ్మిట్ కు తెలంగాణ రాష్ట్రం కేవలం ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు
ఇన్నోవేషన్ సంకల్పంతో కలిసినప్పుడు గ్రామీణ మార్పు ఎలా సాధ్యమవుతుందో
సజీవ సాక్ష్యం కూడా అన్నారు. గ్రామీణ భారతానికి డిజిటల్ హైవేల విషయానికొస్తే
T-Fiber ద్వారా 43,000 కి.మీ.కుపైగా డిజిటల్ బ్యాక్‌బోన్ దాదాపు ప్రతి గ్రామ పంచాయతీని కలుపుతోంది అని వివరించారు. ఇది కేవలం బ్రాడ్‌బాండ్ కాదు, ఇది డిజిటల్ గౌరవం అన్నారు. టెలిమెడిసిన్, రిమోట్ విద్య, ఈ-కామర్స్, ఆధునిక వ్యవసాయానికి ఇది శక్తి గా నిలుస్తుందని తెలిపారు. వాతావరణ స్మార్ట్ వ్యవసాయం విషయానికొస్తే పల్లెలో నీటిని ఆదా చేసే పద్ధతులతో, పొలాల్లో కార్బన్ తగ్గించే చర్యలతో భారతదేశంలోనే మొదటి గోల్డ్ స్టాండర్డ్ కార్బన్ క్రెడిట్స్ ను పుడమి నాటే రైతులకు Telangana అందించిందనీ డిప్యూటీ సీఎం వివరించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో మహిళల SHGs సౌర వ్యాపారిణీలుగా మారుతున్నారు, వారు చెప్పిన సరదా మాట: “సార్… మునుపు వాన కోసం ప్రార్థించేవాళ్లం.
ఇప్పుడు సూర్యకాంతి కోసం కూడా ప్రార్థిస్తాం!” అదే నిజమైన సాధికారత అన్నారు.
గ్రామీణ ఫైనాన్స్ & ఫిన్‌టెక్ విషయానికొస్తే డిజిటల్ క్రెడిట్, మొబైల్ పేమెంట్స్, పంట నుండి మార్కెట్ వరకు ట్రేసబిలిటీ ఇవన్నీ ఏకీకృతం చేస్తున్నారు అని తెలిపారు. మన MSME పాలసీలో ₹100 కోట్లు ‘యంత్రం ఫండ్’, SC/ST, మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు,
ప్రత్యేక కొనుగోలు రిజర్వేషన్లు ఉన్నాయి అని వివరించారు. భవిష్యత్ నైపుణ్యాల గురించి ప్రస్తావించాల్సి వస్తే AgriTech, FinTech, పునరుత్పాదక శక్తి రంగాల్లో స్కిల్ సెంటర్లు 2026 నాటికి 3 లక్షల యువతను నైపుణ్యవంతులను చేయడమే లక్ష్యం అన్నారు. గ్రామీణ సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్తు రంగం 2030 నాటికి 30% పునరుత్పాదక శక్తి లక్ష్యంగా
రూఫ్‌టాప్ సోలార్, సోలార్ పంపులు, గ్రీన్ హైడ్రోజన్ పైలట్లు, సమాజ ఆధారిత ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం అన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 20వ శతాబ్దానికి సంస్థలను నిర్మించారు, అలాగే తెలంగాణ 21వ శతాబ్దానికి అనువైన సంస్థలను నిర్మిస్తోంది అన్నారు. నాబార్డ్ ఇప్పుడు కేవలం వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం కాదు
భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మలుస్తోంది అని డిప్యూటీ సీఎం వివరించారు. ONDC ద్వారా గ్రామీణ ఉత్పత్తిదారుల్ని డిజిటల్ మార్కెట్‌కు కలపడం
- సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కు మద్దతు
- హైదరాబాద్‌లోని ఏకలవ్య ఫౌండేషన్ వంటి సంస్థలను ఆదివాసి సాధికారత కోసం ఆదరించడం
- గ్రామీణ భారత్ మహోత్సవం వంటి జాతీయ ప్రదర్శనలు నిర్వహించడం
- గ్రామీణ ఉత్పత్తులకు ‘గ్రామీణ ట్యాగ్’ ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. ఇవి పథకాలు కావు. సమగ్ర గ్రామీణ దృష్టికోణం విషయానికొస్తే తెలంగాణలో మనం నిర్మిస్తున్న ప్రతిదీ డిజిటల్ మౌలిక వసతులు, అగ్రిటెక్, ఫిన్‌టెక్, పునరుత్పాదక శక్తి, ఇన్క్యుబేషన్ ఇవి అన్నీ ఒకే దృష్టి వైపు సాగుతున్నాయి.
“గ్రామీణ వృద్ధి incremental కాకూడదు… exponential కావాలి.” అన్నారు. డ్రోన్ల ఆధారిత పంట నిర్వహణ, AI మట్టి విశ్లేషణ, డిజిటల్ FPO ప్లాట్‌ఫారమ్‌లు ఇవి ఇక విలాసాలు కావు.
భారత్ ఆహార భద్రత, వాతావరణ ప్రతిఘటనలో ప్రపంచాన్ని నడిపించాలంటే ఇవి అవసరాలు అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్న నాబార్డ్‌కు హృదయపూర్వక అభినందనలు పారంపర్యం, ఇన్నోవేషన్ కలిసి నడిచే నగరం ఇది అని వివరించారు. నాబార్డ్ గ్రామీణ భారతానికి ఎప్పుడూ భాగస్వామి, మార్గదర్శి
కొన్నిసార్లు నిశ్శబ్దంగా కాపాడే దేవదూత అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నాబార్డ్‌తో
లబ్ధిదారుగా కాదు… నిజమైన సహచరుడిగా కలిసి పని చేస్తామని హామీ ఇస్తున్నాను అన్నారు.
వ్యవసాయం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదు. అది భారతదేశపు మొదటి ఆత్మ అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. సాంకేతికత ఈ ఆత్మకు శత్రువు కాదు మిత్రుడు, నాబార్డ్ వంటి సంస్థలు దాని రక్షకులు అన్నారు. మనమందరం కలిసే ముందుకు సాగుదాం దయతో, ధైర్యంతో, మరియు భారత భవిష్యత్తుపై అపార విశ్వాసంతో చేయి చేయి కలిపి ముందుకు నడుద్దాం అని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డ్ చైర్మన్ షాజీ, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ తదితరులు పాల్గొన్నారు.