నేత కార్మికుల రుణమాఫీ కోసం 33 కోట్లు విడుదల:

  • కొండ లక్ష్మణ బాపూజీ జయంతి సందర్భంగా నేత కార్మికులకు రుణమాఫీ చేస్తానని హామి ఇచ్చిన ముఖ్యమంత్రి
  • ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రిగారికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు
  • ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో నేతన్నలకు ఏడాది పొడువున ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం – మంత్రి తుమ్మల
  • నేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం – మంత్రి తుమ్మల
కొండా లక్ష్మణ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్న రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్, అందుకోసం ఈ రోజు 33 కోట్లు విడుదల చేయడం జరిగిందని జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతన్న సంక్షేమం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేత కార్మికుల తరపున మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకురావడంతో పాటు , పునరుద్ధరిండం జరిగిందని తెలిపారు.  ప్రజా ప్రభుత్వ నిర్ణయాల వలన నేత కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందని, అందులో భాగంగా టెస్కోకు రూ.588 కోట్ల విలువైన ఆర్డర్లు రావడం జరిగిందని అన్నారు. నేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హన్మకొండ జిల్లాల్లోని 130 MACS, 56 SSI యూనిట్ల ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద సహాయక సంఘాల మహిళా సభ్యులకు అందించే చీరల ఉత్పత్తి జరిగిందని, తద్వారా మహిళలకు  నాణ్యమైన చీరలు అందిస్తున్నామని వివరించారు.

	ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 1 ప్రకారం అన్ని శాఖలు అవసరమైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని చెప్పామని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికి యూనిఫాం వస్త్రాలు, రెసిడెన్షియల్ విద్యార్థులందరికి యూనిఫాం వస్త్రాలతో పాటు, తువాళ్లు, శెద్దర్లు, బ్లాంకెట్లు, కార్పెట్లు అందించడం జరుగుతున్నదని, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖలోని అంగన్వాడీ ఉపాద్యాయులకు, హెల్పర్లకు మరియు ఆశా వర్కర్లకు నాణ్యమైన చీరలు అందించడం ద్వారా నేత కార్మికులకు  మరియు అనుబంధ కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందని అన్నారు.
	నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.168 కోట్లతో తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా మూడు ముఖ్యమైన పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. నేతన్న పొదుపు పథకంలో నేత కార్మికులు నెలసరి వేతనంలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం 16% వాటాను జమ చేస్తుంది. 2024-25లో రూ.290.09 కోట్లు నిధులు 36,133 మంది ఖాతాల్లో జమ చేయబడ్డాయి. 2025-26లో 33,913 మంది ఈ పథకంలో నమోదు చేసుకోగా, వారి ఖాతాల్లో జమ చేయడానికి రూ.13.56 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మరమగ్గాల రంగంలో కార్మికులు 8% జమ చేస్తే ప్రభుత్వం 8% వాటా రూ.34.07 కోట్లు 11,698 మంది ఖాతాల్లో జమ చేయబడి, మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తికావడంతో పొదుపు మరియు ప్రభుత్వ వాటా కలిపి రూ.68.14 కోట్లను ఆగస్టులో విడుదల చేయడం జరిగింది. నేత కార్మికుల కోసం ఈ పథకం కాలపరిమితిని 36 నెలల నుండి 24 నెలలకు తగ్గించడ జరిగిందని అన్నారు.
	నేతన్న భరోసా పథకంలో భాగంగా కనీసం 50% ఉత్పత్తి చేసిన నేత కార్మికులకు సంవత్సరానికి రూ.18,000 మరియు అనుబంధ కార్మికులకు రూ.6,000 ప్రోత్సాహం అందించబడుతుంది. ఈ పథకానికి రూ.12 కోట్లు కేటాయించడం జరిగింది. నేతన్న భద్రత పథకంలో నేత కార్మికులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ.5 లక్షలు బీమా కింద ఇవ్వడం జరుతుందని, ఇప్పటివరకు 541 కుటుంబాలకు రూ.27.05 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. ఈ పథకం కింద వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి నేత కార్మికుడిని బీమా పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు 48,670 మంది నేత కార్మికులు నమోదు చేసుకున్నారన్నారు.
	రాష్ట్రంలోని నేత కార్మికుల పిల్లలకు ఆధునిక సాంకేతిక విద్యను అందించేందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులు అందించడం జరుగుతుంది. వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు చేయబడింది. ఈ యార్న్ డిపో ద్వారా ఇప్పటివరకు 2,368 మెట్రిక్ టన్నుల నూలు 99 మరమగ్గాల మ్యాక్స్ సంఘాలకు సరఫరా చేయడం జరిగింది. ఇది పవర్ లూమ్ ఆసాముల దీర్ఘకాలిక డిమాండ్, ఇది చిన్న యూనిట్ హోల్డర్లు / ఆసామీలు స్వతంత్రంగా టెస్కో నుండి ఆర్డర్లు తీసుకొని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. టెస్కోకు బకాయిలుగా ఉన్న రూ.630 కోట్లు ప్రభుత్వం విడుదల చేసి సహకార సంఘాలు, SSI, MACSలకు చెల్లింపులు చేశామని తెలిపారు.
పవర్ లూమ్ యూనిట్లకు 25 HP వరకు 50% విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని , మరమగ్గాల కార్మికులకు 10% యార్న్ సబ్సిడీ పథకం కింద 2018 నుండి 2022 వరకు ఉన్న రూ.39.72 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని, అలాగే సిరిసిల్ల అప్పారెల్ పార్క్ లో టెక్స్ పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రారంభించడం ద్వారా 800 మంది మహిళలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. నేత కార్మికులు ఆర్థికంగా బలపడేలా, కుటుంబాలు సుస్థిరంగా నిలిచేలా చేనేత రంగానికి అన్ని విధాల తోడ్పాటు అందించడం మా ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఈ లక్ష్యం సాధనలో మరిన్ని చర్యలు చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు.