తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో “స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్: కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్” చర్చాగోష్టి

హైదరాబాద్ : తెలంగాణ*–నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈరోజు “స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్ – కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్” అనే అంశంపై విశిష్ట చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రముఖ క్రీడాకారులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మిజోరం రాష్ట్ర యువజన సేవల & క్రీడల శాఖ మంత్రి లాల్లింగ్ లోవా హ్మర్ “మిజోరం -ఫ్యూచర్ స్పోర్ట్స్ పవర్ హౌస్” అంశంపై మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలలోని క్రీడా ప్రతిభను జాతీయ వేదికకు తీసుకెళ్లే అవకాశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలంగాణలో క్రీడల అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించారు.

బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీ నిర్వహణ, ప్రతిభావికాస విధానాలపై మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఫుట్‌బాల్ స్టార్ బయ్ చింగ్ భూటియా క్రీడా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంపై ప్రాధాన్యతను వివరించారు. మణిపూర్ వెయిట్‌లిఫ్టింగ్ స్టార్, పద్మశ్రీ మీరాబాయి చాను క్రీడల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అంచనా వేసి, వాటి పరిష్కార దిశలో సూచనలు చేశారు. అర్జున అవార్డు గ్రహీత బాక్సర్, ఎల్. సరితాదేవి క్రీడాకారుల తీర్చిదిద్దడంలో కోచ్‌ల కీలకపాత్రను విశదీకరించారు. త్రిపురకు చెందిన అర్జున అవార్డు గ్రహీత మంతు దేవనాద్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారుల అభివృద్ధిలో అకాడమీల ప్రాధాన్యాన్ని వివరించారు. క్రీడా జర్నలిస్టు ఇంద్రనీల్ దాస్ ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడల వల్ల సంభవించిన సామాజిక మార్పులను వివరించారు. మణిపూర్ వెటరన్ జర్నలిస్టు ప్రదీప్ ఫాంజోభం చర్చాగోష్టి సమన్వయకర్తగా వ్యవహరించారు. వక్తలు తెలంగాణ–ఈశాన్య రాష్ట్రాలకు క్రీడా రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను గుర్తిస్తూ, ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు, ప్రజలు కలిసి పనిచేసే అవసరాన్ని హైలైట్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ డా. సోనీ బాలాదేవి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మరియు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, క్రీడా సంఘాలు, ఫెడరేషన్ ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.