తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు పకడ్బందీ ఏర్పాట్లు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు

హైదరాబాద్ : ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సబ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సి.ఎం. ఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.ఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ, ఈ సమ్మిట్ లో పాల్గొనే ప్రముఖులకు, దేశ, విదేశీ అతిథులకు ఆహ్వానాలు పంపించడం జరుగుతోందని, ఈ సమ్మిట్ కు హాజరయ్యే వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలని అన్నారు. ఈ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా ప్రజా భావన్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో నిర్వహిచే అతిపెద్ద సమ్మిట్ లో రాష్ట్రానికి చెందిన అన్నిశాఖలు తమ పురోగతిని షో కేస్ చేయాలన్నారు. ప్రధానంగా ప్లీనరీ, గౌరవ ముఖ్యమంత్రి చే వన్ టు వన్ సమావేశాలు, వివిధ సంస్థలచే ఎం.ఓ.యూ. లనే ప్రధాన అంశాలుంటాయని తెలిపారు. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ 13 తేదీ వరకు ఈ సమ్మిట్ కొనసాగుతుందని, 13 న ఉప్పల్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ తో ముగుస్తుందని వెల్లడించారు.