- భూ హక్కుల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు సమూల మార్పులు 2. 29 కోట్ల సర్వే నెంబర్లకు భూధార్ నెంబర్ కేటాయింపునకు చర్యలు
- 373 నక్షా గ్రామాల్లో రీసర్వేకు సన్నాహాలు
- వచ్చే జనవరి నాటికి మూడు శాఖల సమాచారంతో ప్రత్యేక యాప్
- అక్రమాలపై రెండు జిల్లాలో సాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్
- భూ సమస్యలపై త్వరలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు
- ఒకే గొడుగు కిందకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్
- హిల్ట్ పాలసీపై బి ఆర్ ఎస్ ద్వంద్వవైఖరి- ఆనాటి మున్సిపల్ మంత్రి ముడుపులు తీసుకొని ల్యాండ్ కన్వర్షన్ చేశారు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
బుధవారం డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను అందుబాలులోకి తీసుకువస్తామని ,ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన యాప్‌ను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ఎసీ తగు కసరత్తు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాల్లో సరిహద్దుల, భూధార్ నెంబర్ల కేటాయింపు వంటి ప్రధాన అంశాలతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి పని పూర్తి చేశామని , ఈ ఐదు గ్రామాలకు భూదార్ కార్డులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన 408 గ్రామాల్లో పట్టణ ప్రాంతాలు మినహా 373 గ్రామాల్లో రెండవ విడత కింద సర్వే నిర్వహిస్తామన్నారు. మూడవ విడతగా అన్నిజిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూదార్ కార్డులు అందిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఇంతవరకు భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులలో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరు కల్లా పరిష్కరిస్తామని, ఆ తర్వాత ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాం నుంచి చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీసేందుకు గాను ఇంతవరకు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని, వాటి ఫలితాలను గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అక్రమార్కుల భరతం పడతామన్నారు. గడచిన పది సంవత్సరాలలో ఆనాటి పాలకుల స్వార్ధపూరిత నిర్ణయాల వల్ల విధ్వంసమైన , కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్ధను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకంలో రెండేళ్లలో సామాన్యులకు రెవెన్యూ సేవలను చేరువ చేశామని తెలిపారు. భూ హక్కుల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు ప్రతి పౌరుడికి మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్ధలో సంస్కరణలు చేపట్టి అమలు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణీ దరఖాస్తులకు మోక్షం కల్పించాం. అధికారం చేపట్టిననాటికి 2.45 లక్షల ధరణీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత మరో నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించి ప్రజల సంతృప్తికి తొలి అడుగు వేశాం. ధరణి పోర్టల్ బాధ్యతలను ప్రభుత్వ సంస్ధలకు అప్పగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ధరణి పోర్టల్ నిర్వహణను టెరాసిస్ అనే విదేశీ సంస్ధ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్ఐసికి అప్పగించడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతుల కోటీ 56 లక్షల ఎకరాల భూమి వివరాలు ఇప్పుడు సురక్షితమైన స్వదేశీ సంస్ధ పరిధిలోకి వచ్చాయి.
రాష్ట్రంలో రెవెన్యూ సేవలను సరళీకృతం చేయడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీగా భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు మూడు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించగా దాదాపు 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ నోటీసులు జారీ చేసి దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వస్తే గ్రామాలలో రెవెన్యూ వ్యవస్ధను పునరుద్దరిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ వారీగా విభజించి జీపీవోలను నియమించడం జరిగింది. అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే ప్రక్రియలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీకి చర్యలు చేపట్టడంతోపాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. భూవిస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6గురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నాం. ఇప్పటికే దాదాపు నాలుగు వేల మందికి శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేశాం. డిసెంబర్ నెల నుంచి మరో మూడు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి చెట్లకింద నిరీక్షించే పరిస్ధితికి స్లాట్ బుకింగ్ ద్వారా తెరదించాం. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు దశల్లో ఈ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టడమేగాక ఆధార్ -ఈ సంతకం కూడా అమలు చేసి ప్రజల డబ్బు, సమయం ఆదా చేశాం. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కార్పొరేట్ స్ధాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించాం. హిల్ట్ పాలసీపై స్పందిస్తూ నోరుందని ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. ఆనాడు ప్రభుత్వంలో ఎమ్ ఎ యూ డీ మంత్రిగా ఆయనకు నచ్చిన వారికి ముడుపులు చెల్లించిన వారికి ల్యాండ్ కన్వర్షన్ చేశారు. వారికి అవసరమైన ప్రాంతాలను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చారు. మేం అలా చేయలేదు. పారదర్శకంగా క్యాబినెట్ తీర్మానం చేశాం. ఆనాడు కన్వర్షన్ చేసిన ల్యాండ్ వివరాల చిట్టాను విప్పుతామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
