- అతిపెద్ద భూ కుంభకోణానికి తెరతీసిన కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజం
- పరిశ్రమల తరలింపు పేరిట భూ కుంభకోణమంటూ మండిపాటు
- హిల్ట్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం ఆగదని స్పష్టీకరణ
ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులను అంటగట్టి.. రూ.వేల కోట్లను దండుకునేందుకే కాంగ్రెస్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని నిరసిస్తూ బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం కదం తొక్కింది. పారిశ్రామికవాడల్లో అడుగడుగునా కార్మికులు, చిన్న, పెద్దతరహాల రంగాల నిర్వాహకులతో ముచ్చటిస్తూ రేవంత్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురువారం జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో పని చేస్తున్న కార్మికులు, ఆయా కంపెనీల యజమానులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కార్మికులు కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. హమాలీలతో మాట్లాడి పరిశ్రమలు తరలిపోతే వారికి ఎదురయ్యే సమస్యలను వివరించారు. ఇండ్లు, పాఠశాలలు, శ్మశానవాటికలు నిర్మించేందుకు స్థలం లేదంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 9292 ఎకరాల భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు అగ్గువకు కట్టబెడుతున్నదని విమర్శించారు.
రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హిల్ట్ పాలసీని నిరసిస్తూ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ నవీన్‌రావులతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ కలిసి సనత్‌నగర్ పారిశ్రామికవాడను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని 1.5 కోట్ల మందికి కనీస మౌలిక వసతులైన పాఠశాలల భవనాలు, అంగన్వాడీ భవనాలు, క్రీడా మైదానాలు, పార్కులు, ఆసుపత్రులు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు 9292 ఎకరాలను సిద్ధం చేస్తుండడం వెనుక రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. 87.31 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న సనత్‌నగర్ పారిశ్రామికవాడ రిజిస్ట్రేషన్ శాఖ విలువ రూ. 21 కోట్లు కాగా బహిరంగ మార్కెట్ ధర రూ. 45 కోట్లకు పై మాటేనన్నారు. హిల్ట్ పాలసీ ద్వారా ఈ భూములను రూ. 6.31 కోట్లకు మాత్రమే ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను ప్రజలతో కలిసి ఎదుర్కొంటామన్నారు.
లక్షలాది మంది పేద కార్మికుల పొట్ట కొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకువచ్చిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా రాష్ర్టాన్ని అమ్ముకోవచ్చో రేవంత్‌రెడ్డి చేసి చూపిస్తున్నారని విమర్శించారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేసి చూపించాలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ బృందం కాటేదాన్ పారిశ్రామికవాడలో పర్యటించింది. మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కార్తిక్‌రెడ్డితో కలిసి ఆమె కాటేదాన్ పారిశ్రామికవాడలో కార్మికులతో మాట్లాడారు. అనంతరం చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు.
