కేటీఆర్ ది విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • ఎల్‌బి న‌గ‌ర్‌లో సిరీస్ ఫ్యాక్ట‌రీ భూముల‌ను రెసిడెన్షియ‌ల్ జోన్‌గా మార్చింది కేటీఆర్ కాదా?
  • అయ్య ముఖ్య‌మంత్రిగా, కొడుకు మంత్రిగా వేల ఎక‌రాలు ధారాద‌త్తం చేశారు.
  • హిల్ట్ పాల‌సీపై కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు మంత్రి పొంగులేటి కౌంట‌ర్

హైద‌రాబాద్ : హిల్ట్ పాల‌సీపై బి.ఆర్. ఎస్ విమ‌ర్శ‌ల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తిప్పికొట్టారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో హిల్ట్ పాల‌సీపై బిఆర్ఎస్ ఆరోప‌ణ‌ల‌పై విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పొంగులేటి స‌మాధాన‌మిచ్చారు. హిల్ట్ పాల‌సీలో రెండు అంశాలు బిఆర్ఎస్ పాల‌న‌లో వ‌చ్చిన‌వే, ఆ ఫైల్‌పై మంత్రిగా కేటీఆర్ సంత‌కం చేసిన సంగ‌తి మ‌రిచారా?గ‌త ప్ర‌భుత్వంలో కోకాపేట‌, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారు, హిల్ట్‌ను దోపిడీ పాల‌సీ అంటున్న కేటీఆర్‌కు ఇవి గుర్తులేవా?ఓఆర్ ఆర్ నిర్వ‌హ‌ణ‌ను కూడా వేలం వేశారు. అయ్య ముఖ్య‌మంత్రిగా కొడుకు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా కావ‌ల‌సిన వారి ద‌గ్గ‌ర ముడుపులు తీసుకొని భూముల‌ను క‌న్వ‌ర్ష‌న్ చేశారు. ప్ర‌భుత్వ భూములు వేలం వేశారు. ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా వేలాది ఎక‌రాలు వేలం వేశారు.ఆనాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎల్‌బి న‌గ‌ర్‌లోని దాదాపు 40 ఎక‌రాల స్ధ‌లాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇవ్వ‌డం జ‌రిగింది. అక్క‌డ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ తోటి భూగ‌ర్భ జ‌లాలు క‌లుషితం అవుతున్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న కూడా చేశారు. ఈ కెమిక‌ల్ ఇండ‌స్ట్రీని రెసిడెన్షియ‌ల్ జోన్‌గా మార్చింది బిఆర్ఎస్ కాదా? ఈ ఫైలుపై అయ్య కొడుకులు సంత‌కాలు చేయ‌లేదా? ఏ పాల‌సీతో ఈ క‌న్వ‌ర్ష‌న్ చేశారు. ఐడిపిఎల్ లో కూడా ఇదే విధంగా చేశారు. కేటీఆర్ క‌డుపునిండా విష‌మేఉంది. విషం క‌క్క‌డానికి కూడా ఒక హ‌ద్దు, అదుపు, ప‌ద్ద‌తి ఉంటుంది. కేటీఆర్ ది క‌డుపుమంట‌. విష‌పూరిత‌మైన ఆలోచ‌న. హిల్ట్ పాల‌సీపై బిజేపీ , బిఆర్ఎస్‌ది ఒకే డ్రామా. స్క్రిప్ట్ రాసేది ఒక‌రు. డెలివ‌రీ చేసేది మ‌రొక‌రు.