గ్లోబల్ సమ్మిట్‌కు హర్యానా సీఎం, పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రిని స్వయంగా ఆహ్వానించిన మంత్రి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025” కు ఆహ్వానాల కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలను సందర్శించారు. సమ్మిట్ ప్రాముఖ్యత, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి పథం, పెట్టుబడుల అవకాశాలు, రాష్ట్రాల మధ్య సహకార వేదిక వంటి కీలక అంశాలపై ఇరురాష్ట్రాల నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి Nayab Singh Saini ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి, డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందించారు. రాష్ట్ర పెట్టుబడుల వాతావరణం, TS-iPASS ద్వారా లభిస్తున్న వేగవంతమైన అనుమతులు, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న విధానం, IT–ఫార్మా–ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిపై ఆయన CM సైనీకి వివరంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధి వేగం, పెట్టుబడులను ఆకర్షించే దూరదృష్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వెలుగు చూస్తున్న కొత్త అవకాశాలను హర్యానా సీఎం ప్రశంసించారు. దేశంలోని రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని కూడా ఇరువురు నాయకులు ప్రస్తావించారు.

అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటనలో ఉండటంతో, పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ Harpal Singh గారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలుసుకుని సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానం అందించారు. పంజాబ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ప్రాసెసింగ్, అగ్రిటెక్, MSME, స్టార్ట్‌అప్ సహకారాలు, పర్యాటక–సాంస్కృతిక మార్పిడి, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భాగస్వామ్యం కల్పించే అవకాశాలపై విస్తృత చర్చ జరిగింది. పంజాబ్ తరఫున కూడా తెలంగాణతో కలిసి పనిచేయాలనే ఆసక్తి వ్యక్తం చేయబడింది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్ విలువను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, తెలంగాణ అభివృద్ధి దిశలో నిర్ణయాత్మక అడుగులు వేయడం వంటి లక్ష్యాలతో ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం దావోస్ తరహాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. “తెలంగాణ రైజింగ్–2047” దార్శనిక పత్రాన్ని కూడా ఈ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ప్రముఖులు, CEOలు, టెక్నాలజీ నిపుణులు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా దాదాపు 3 వేల మంది పాల్గొననున్నారు. సినీ స్టూడియోలు, పర్యాటకాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ వంటి రంగాల్లో ఈ సమ్మిట్‌లో అనేక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్ వికసనానికి, ఆర్థికాభివృద్ధికి, తదుపరి రెండు దశాబ్దాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా ఈ సమ్మిట్ నిలవనుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.