
పునరావాస కేంద్రంగా పీసీబీ
పనితీరు మెరుగుపర్చాలని గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతి
తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్ పీసీబీ) పనితీరు బాగా లేదని, దాన్ని బలోపేతం చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ రాష్ట్ర గవర్నర్ కు విన్నవించింది. ఈ మేరకు పోరం ప్రతినిధులు శనివారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అంతగా అవసరంలేని అధికారులకు పునరావాస కేంద్రంగా కాలుష్య నియంత్రణ మడలి (పీసీబీ) మారిందని ఎఫ్ జీజీ విమర్శించింది. పీసీబీ బోర్డు సభ్యుల నియామకాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతోందని పేర్కొంది. టీఎస్ పీసీబీ చట్టాలను సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. చట్టాలపై నాలెడ్జ్ ఉన్నవారు బోర్డులో లేరని, సరైన వ్యక్తులను నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీబీలో పర్యావరణానికి సంబంధించిన వారినే నియమించడానికి విధివిధానాలు రూపొందించాలని 2017లో రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పీసీబీలో కావాల్సినంత మంది ఇంజినీర్లు, ఇతర సాంకేతిక సిబ్బందిలేరని, వెంటనే వారి నియామకాన్ని చేపట్టాల్సి ఉందని అన్నారు.