హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • లీజు భూములు,షాపుల‌ రెగ్యుల‌రైజేష‌న్ కు అవ‌కాశం
  • ఇంటి ప‌క్క‌నే ఉన్న‌వంద గ‌జాల్లోపు స్ధ‌లాల విక్ర‌యాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : హౌసింగ్ బోర్డు భూములు ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. హౌసింగ్ బోర్డు భూముల‌పై సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు త‌ద‌త‌ర అంశాల‌పై సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఒక‌వైపు భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటూనే మ‌రో వైపు లీజు, క‌మ‌ర్షియ‌ల్, అద్దెలు, రెగ్యుల‌రైజేష‌న్ త‌దిత‌ర అంశాల‌పై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నిజాం కాలం నుంచి 115 సంస్ధ‌ల‌కు హౌసింగ్ బోర్డు భూముల‌ను లీజుకు ఇవ్వ‌డం జ‌రిగిందని, ఇందులోప్ర‌ధానంగా ఇనిస్ట్యూష‌న్స్‌, రెసిడెన్షియ‌ల్, క‌మ‌ర్షియ‌ల్‌, స్కూల్స్‌, టెంపుల్స్ త‌దిత‌రాలు ఉన్నాయ‌ని , ఏడు స్ధ‌లాల‌కు సంబంధించి కోర్టు కేసులు, అలాగే అద్దెబ‌కాయిలు ఉన్నాయ‌ని అధికారులు మంత్రి గారికి వివ‌రించారు. లీజు అగ్రిమెంట్ పున‌రుద్ద‌ర‌ణ చేసుకోని సంస్ధ‌ల‌కు హౌసింగ్ బోర్డు త‌ర‌పున లేఖలు రాసి వాటి రెగ్యుల‌రైజేష‌న్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు.

రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వివిధ ప్రాంతాల్లో 301 క‌మర్షియ‌ల్ షాపులు ఉండ‌గా 2007లో అప్ప‌టి ప్ర‌భుత్వం ఇచ్చిన అవ‌కాశం మేర‌కు 14 మంది షాపులు కొనుగోలు చేయ‌గా మిగిలిన 287 షాపుల‌కు గాను 62 షాపులు ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్నాయ‌ని , హౌసింగ్ బోర్డు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి షాపు య‌జ‌మాని ప్ర‌తి ఏడాది 10శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని అయితే ఈ నిబంధ‌న అమ‌లు కాక‌పోవ‌డంతో షాపు య‌జ‌మానుల నుంచి హౌసింగ్ బోర్డుకు కోట్లాది రూపాయిలు రావ‌ల‌సి ఉంద‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్ర‌స్తుతం షాపులు నిర్వ‌హిస్తున్న‌వారు ఆ షాపుల‌ను కొనుగోలు చేయ‌డానికి ముందుకువ‌స్తే మార్కెట్ ధ‌ర ప్ర‌కారం విక్ర‌యించ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. అలాగే షాపు నిర్వ‌హ‌ణ‌కు అనువుగా లేక‌పోతే ఆ స్ధ‌లాన్ని వేలంలో విక్ర‌యించాల‌ని సూచించారు. కోర్టు కేసుల‌లో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకు చెందేలా ప‌టిష్ట‌మైన వాద‌న వినిపించేలా ప్ర‌త్యేకంగా అడ్వ‌కేట్‌ను నియ‌మించుకోవాల‌ని సూచించారు. హౌసింగ్ బోర్డు గ‌తంలో కేటాయించిన ఇండ్ల‌కు ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల లోపు స్ధలాల‌ను ఆఇంటి య‌జ‌మానికి ఆస‌క్తి ఉంటే విక్ర‌యించాల‌ని అలాగే గ‌తంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్ధ‌లాన్ని రిజిస్ట్రేష‌న్ చేసుకోనివారికి ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ అవ‌కాశం క‌ల్పించాల‌ని, ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల లోపు స్ధ‌లాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్ధ‌లానికి రిజిస్ట్రేష‌న్ చేయించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని సూచించారు. మార్కెట్ ధ‌ర‌, స‌బ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గ‌జాల లోపు స్ధ‌లాల వివ‌రాలు, రిజిస్ట్రేష‌న్ కాని ప్లాట్ల వివ‌రాలు, రిజిస్ట్రేష‌న్ చేసుకొని ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల‌లోపు స్ధ‌లాన్ని అడుగుతున్నవారి వివ‌రాలు త‌దిత‌ర అంశాల‌పై పూర్తిస్ధాయి నివేదిక త‌యారుచేయాల‌ని అధికారుల‌కు సూచించారు. వీట‌న్నింటిపై క్యాబినెట్‌లో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఈ స‌మావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ విపి గౌత‌మ్‌, సీఈ వెంక‌ట ర‌మణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.