- ప్రధాన రంగాల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, సమాలోచనలు వంటి కీలక అంశాలు చర్చిద్దామని మంత్రి కోమటి రెడ్డికి ఆహ్వానం
- ఇంటిగ్రేటెడ్ కనెక్టివిటీ ప్లానింగ్ – రీజినల్ మాస్టర్ ప్లాన్,రోడ్ నెట్వర్క్ అభివృద్ధి,ప్రాజెక్ట్ అంచనా,పెట్టుబడుల విధానం పై చర్చిద్దామని ఆహ్వాన లేఖలో పేర్కొన్న గడ్కరీ
- ఈనెల 19,20వ తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న చింతన్ శిబిరం
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆహ్వానం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫెడరలిజం భావం పెంపొందిస్తుందన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- బిన్న ప్రభుత్వాలు ఉన్నా..ప్రజల అభివృద్ధి కేంద్రీకృతంగా జరిగే కేంద్ర,రాష్ట్రాల సమన్వయం ప్రజా స్వామ్యంలో శుభ సూచకమన్నా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- రాజకీయ పార్టీ నేపథ్యం వేరైనా వ్యక్తిగతంగా గడ్కరీ తనకు ఆప్తుడని..రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి శషబిషలు లేవన్న మంత్రి
- రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అనేక వేదికల మీద చెప్పారని గుర్తు చేసిన మంత్రి
హైదరాబాద్: కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ చింతన్ శిబిరం–2025 కు ఆహ్వానించినందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 19–20 తేదీల్లో న్యూఢిల్లీ, యశోభూమి వేదికగా నిర్వహించనున్న ఈ చింతన్ శిబిరం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, భూసేకరణలో డిజిటలైజేషన్, స్మార్ట్ రోడ్లు, రోడ్డు భద్రత, నాణ్యత ప్రమాణాల పెంపు వంటి అంశాలపై జరగనున్న చర్చలు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, హైవే అభివృద్ధి,రోడ్డు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా కలిసి పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ చింతన్ శిబిరంలో తెలంగాణ రాష్ట్రం చురుకైన పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ అనుభవాలు మరియు ఉత్తమ విధానాలను ఈ వేదికపై పంచుకుంటామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజన్ 2047 తెలంగాణ రైసింగ్ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని,ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్ పాలసీని ఆవిష్కరించామని గుర్తు చేశారు. 49వేల కి.మీ రోడ్ నెట్వర్క్ ఉన్న తెలంగాణలో ప్రతి రహదారి 4లేన్,6లేన్ రహదారులుగా మార్చే విజన్ తో వెళ్తున్నామని లక్ష 15వేల కి.మీ రోడ్ నెట్వర్క్ లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు,నేషనల్ హైవేలు పలు కారిడార్లు, మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్,NH 65 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 8లేన్ విస్తరణ,భారత్ ఫ్యూచర్ సిటీ నుండి సౌత్ ఇండియా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అమరావతి,చెన్నై,బెంగళూరు, మచిలీపట్నం పోర్టు తో పాటు నాగపూర్ కు హై స్పీడ్ హైవే,బుల్లెట్ ట్రైన్ కారిడార్ల నిర్మాణ విజన్ తో పనిచేస్తున్నామని,అందుకు కేంద్ర సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు,సమన్వయం ద్వారా జటిలమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్ గడ్కరీ లేఖ ఫెడరల్ స్పూర్తికి నిదర్శనంగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఈ శిబిరంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి లేవనెత్తే అంశాలపై పూర్తి అజెండా రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొంటూ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వాన్ని మంత్రి అభినందించారు.