గోల్కొండ కోటలో విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ : 54 వ విజయ్ దివస్ సందర్భంగా… 1971లో ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు. వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని, దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించారని చెప్పారు. ఈ విజయ్ దివస్ వారి పరాక్రమానికి వందనమర్పించేదిగా, వారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. సైనికుల వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకుని మంగళవారం చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1971 యుద్ధంలో భారత సాయుధ దళాలు కేవలం 13 రోజుల్లోనే చారిత్రక విజయం సాధించాయని, 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ అవతరించిందని మంత్రి గుర్తు చేశారు.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దృఢమైన నాయకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం ఆమె ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని, సాయుధ దళాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు.

ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా, అరుణ్ ఖేతర్పాల్, ఆల్బర్ట్ ఎక్కా వంటి వీరుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు. లాంగేవాలా నుంచి తూర్పు యుద్ధరంగం వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో, క్రమశిక్షణతో పోరాడిన తీరు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావించిన మంత్రి, భారత్ శాంతిని కోరుకుంటూనే జాతీయ భద్రతకు ముప్పు వస్తే గట్టిగా ప్రతిస్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిందన్నారు.

గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశంలో విజయ్ దివస్‌ను జరుపుకోవడం గర్వకారణమని, తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సాయుధ దళాల పక్షాన దృఢంగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. యువతరం ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాల విలువను తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఏఎస్ఏ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, బ్రిగేడియర్ రాహుల్ Thaplyad , డీజీపీ శివధర్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఎండీసీఆర్ఎల్ ఎండీ నర్సింహరెడ్డి, టీజీటీడీసీ ఎండీ క్రాంతి వల్లూరు, తదితరులు పాల్గొన్నారు.