- సంక్షేమం నుంచి సాధికారత దాకా… దివ్యాంగుల కోసం తెలంగాణ సరికొత్త మోడల్
- ప్రభుత్వ–స్టార్టప్ భాగస్వామ్యంతో దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగు
- అవకాశం ఇస్తే చాలు… దివ్యాంగులే తమ భవిష్యత్ నిర్మాతలు
- సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సంక్షేమంతో పాటు దివ్యాంగులు స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గౌరవ సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని Alien Innovations కార్యాలయంలో గురువారం నిర్వహించిన దివ్యాంగుల కోసం అసిస్టివ్ టెక్నాలజీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు కేవలం సహాయం పొందే వర్గం కాదని, అవకాశం ఇస్తే తమ కాళ్లపై తామే నిలబడి ఆత్మవిశ్వాసంతో జీవించగల సామర్థ్యం ఉన్న పౌరులని మంత్రి పేర్కొన్నారు. ఇదే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్పష్టమైన దృక్పథమని తెలిపారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం పింఛన్లకే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, ఉద్యోగ రిజర్వేషన్, టెక్నాలజీ, స్వయం ఉపాధి అన్నీ కలిసేలా సమగ్ర విధానంతో పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగుల పింఛన్లు సకాలంలో, ఎలాంటి అడ్డంకులు లేకుండా పేద దివ్యాంగుడి చేతికి చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే చదువుతున్న దివ్యాంగ విద్యార్థి ఎక్కడా ఆగిపోకుండా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు ఉన్న రిజర్వేషన్ కాగితాల్లోనే కాకుండా వాస్తవంగా ఉద్యోగాల్లో కనిపించాలన్నదే సీఎం గారి స్పష్టమైన ఆదేశమని గుర్తు చేశారు. ఈ లక్ష్య సాధనలో టెక్నాలజీ ఆధారిత ఇన్నోవేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC) అనేక మంది యువ ఆవిష్కర్తలకు మార్గదర్శకత్వం చేస్తూ వారి ఆలోచనలను స్టార్టప్‌లుగా మార్చడంలో ముందుండి పనిచేస్తోందని మంత్రి ప్రశంసించారు. TGIC మద్దతుతో ఎదిగిన Alien Innovations వంటి సంస్థలు దివ్యాంగుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే ఉత్పత్తులను రూపొందించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో Alien Innovations రూపొందించిన “Navinault” అసిస్టివ్ టెక్ పరికరాలను 20 మందికి పైగా దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు గౌరవ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకుండా తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకునేలా ఈ టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. ఇది కేవలం వ్యాపారం కాదని, సామాజిక బాధ్యతతో కూడిన ఇన్నోవేషన్ అని పేర్కొన్నారు. Bosch వంటి సంస్థలు ముందుకు వచ్చినట్లే మరిన్ని కార్పొరేట్ సంస్థలు CSR ద్వారా దివ్యాంగుల సాధికారతకు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. CSR ద్వారా వచ్చే నిధులు దివ్యాంగుల సంక్షేమానికి మాత్రమే కాకుండా వారి స్వయం ఆధారిత జీవనంలో పెట్టుబడిగా మారాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ–CSR–స్టార్టప్ భాగస్వామ్యంతో దివ్యాంగుల కోసం ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని భారతదేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే Alien Innovations వ్యవస్థాపకుడు రవి కిరణ్ ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన Global IMAGEN Venture Winner Award సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందడం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని మంత్రి తెలిపారు. TGIC మద్దతుతో ఎదిగిన ఇన్నోవేటర్‌గా రవి దృష్టిలోపం ఉన్నవారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తూ, తెలంగాణను మరింత అందుబాటులో ఉండే రాష్ట్రంగా మార్చాలన్న స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో TGIC సీఈఓ మిరాజ్, యునిసెఫ్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) ఫీల్డ్ ఆఫీసర్ జెలామియాలి, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి ప్రదీప్‌తో పాటు నెట్వర్క్ మోడల్‌పై పనిచేస్తున్న పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.