- ఇప్పటికే రైతుల నుండి దరఖాస్తులు తీసుకుంటున్న అధికారులు
- రైతుభరోసా కోసం శాటిలైట్ ఇమెజ్ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
- ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.
- సేంద్రియ వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి
- వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి తుమ్మల
హైదరాబాద్: జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయశాఖ అధికారులను తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఆపేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని, ఇప్పటికే జాతీయ ఆహర భద్రత మిషన్ లో భాగంగా పప్పుదినుసుల విత్తనాలను సబ్సిడీపై అందించడం జరిగిందని గుర్తుచేశారు. ఇక ఇప్పుడు రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు, ఈ పథకంలో భాగంగా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు/యంత్రాలు అందచేయనున్నట్లు తెలిపారు.
రైతు యాంత్రీకరణ పథకం కింద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జనవరి నెలలోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి, రైతులకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్ల కాలంలో రైతుబంధు పేరుతో రైతు యాంత్రీకరణ పథకాన్ని నిర్లక్ష్యం చేసిన అప్పటి ప్రభుత్వ వైఖరిని మంత్రి ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు.
జిల్లా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారిగా పర్యటించి, రైతులకు అందుతున్న సబ్సిడీలు, యాంత్రీకరణ పథకం దరఖాస్తులు, యూరియా యాప్ అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని మంత్రి సూచించారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కారాలు అందించాలన్నారు.
ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఒక్క పైసాను కూడా వృధా చేయకూడదనే ఆలోచనతో ఉన్నారని, అందుకోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు ఇప్పటికే కేంద్ర పథకాల కోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి 400 కోట్లను వినియోగించడం జరిగిందని తెలియజేశారు. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రైతులకు సబ్సిడీలు అందిస్తూ, ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇది రైతుల ఆదాయం పెంచడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో యూరియా యాప్ సమర్థవంతంగా అమలవుతోందని, రైతులు కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాలలోని రైతులు ఎక్కువగా యూరియా కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, యాప్ ద్వారా కూడా రైతులు తమకు కావాల్సినంత యూరియాను కొనుగోలు చేయొచ్చని, కావున రైతులెవరు అనవసర భయాందోళనకు గురి కావద్దని మంత్రి కోరారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా యాప్ ను అమలు చేస్తామని మంత్రిగారు స్పష్టం చేశారు.
రబీ సీజన్ రైతుభరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ను త్వరితగతిన పూర్తి చేసి, రైతుభరోసా నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు వివరించి, దీర్ఘకాలికంగా మట్టిసారాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించే విధానాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా నిలిచేలా అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.