- ఆదివాసీ గూడెం నుంచి మహానగరం వైపు.. ఆదివాసీలకు హైదరాబాద్ విజ్ఞాన యాత్ర!
- అక్కడి చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ఆకాశహర్మ్యాలు, నగర జీవన విధానాన్ని చూపిస్తాం
- ఆదివాసీ గూడేల్లో పక్కా ఇళ్ల నుంచి పలక, బలపం దాకా.. అన్ని సౌకర్యాలు సమకూరుస్తాం
- కుమ్మరికుంట ఆదివాసీలతో మంత్రి జూపల్లి ముచ్చట!
- సాంస్కృతిక మార్పిడి ద్వారా గిరిజన గూడెల వికాసం: మంత్రి జూపల్లి కృష్ణారావు
ఉట్నూరు (ఆదిలాబాద్ జిల్లా): ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న మినీ కాశ్మీర్ గా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్ ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. కానీ, ఇక్కడే పుట్టి పెరిగిన అడవి బిడ్డలకు ఆధునిక ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకపోవడం నన్ను కలచివేసింది. అందుకే, కుమ్మరికుంట గూడెం ఆదివాసీలను ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తీసుకువెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద,ఆకాశహర్మ్యాలు, మెట్రో రైళ్లు నగరవాసుల జీవన విధానాన్ని చూపిస్తాం” అని మంత్రి ప్రకటించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా హైదరాబాద్ లో వారికి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలను కూడా చూపిస్తామని చెప్పారు. మీరు కేవలం అడవికి పరిమితం కాకూడదు, బయటి ప్రపంచాన్ని చూడాలి, జ్ఞానంతో మీ బతుకులను, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని మంత్రి ఆకాంక్షించారు. ఈ పర్యటనకు అయ్యే రవాణా, భోజన, వసతి ఖర్చులన్నీ పర్యాటక, సాంస్కృతిక శాఖ భరిస్తుందని హామీ ఇచ్చారు.
శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరికుంట ఆదివాసీ గూడెన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నాగరికతకు ఆమడ దూరంలో, కొండ కోనల మధ్య బతుకులీడుస్తున్న గిరిజనులతో ఆయన నేరుగా ముచ్చటించి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 వసంతాలు గడిచినా, నేటికీ ఆదివాసీ గూడెల్లో దుర్భర పరిస్థితులు కొనసాగడం విచారకరమనిమంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివాసీల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడకపోవడంపై అధికారులతో చర్చించి, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మీ పిల్లలను బడికి పంపి గొప్పగా చదివించాలి, అది వారి భవిష్యత్తును మారుస్తుంది. దాంతో పాటు, మీరు కూడా కనీసం సంతకం పెట్టడం నేర్చుకోవాలి. అక్షర జ్ఞానం ఉంటే అది మీకు మరింత భరోసానిస్తుంది, అక్షరాస్యత సాధించి, జీవనప్రమాణాలను మెరుగుపరుచుకోవడమే కుమ్రం భీం, రాంజీ గోండు లాంటి మహానీయులకు మనమిచ్చే అసలైన ఘన నివాళి అని వారిలో స్పూర్తిని నింపారు. చదువుకోవడానికి కావాల్సిన పలక, బలపం, ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీలకు కూడు, గూడు, విద్యా, వైద్యం వంటి ప్రాథమిక అవసరాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం” అని మంత్రి స్పష్టం చేశారు. వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
