- మూడు దశల్లో 94 సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
హైదరాబాద్ : స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సమర్దవంతంగా సులువుగా పారదర్శకంగా అవినీతిరహితంగా మెరుగైన సేవలు అందించడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
శాసన మండలిలో సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎ. వి. ఎన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘంగా జవాబు ఇచ్చారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించే పరిస్ధితికి తెరదించుతున్నాం. సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవస్ధ వలన అవినీతికి అడ్డుకట్టపడుతుంది. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 94 అద్దె భవనాల్లో 50 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. మూడు దశల్లో వీటికి శాశ్వత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలనకు ఇబ్బంది లేకుండా అత్యాధునికంగా కార్పొరేట్ స్ధాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా నిర్మిస్తున్నాం. మొదటి దశలో ఔటర్ రింగ్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి సమీకృత సబ్ రిజిస్ట్రార్ భవనాలు నిర్మిస్తున్నాం.
ఈ 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి 69 శాతం ఆదాయం వస్తుంది. గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) (ఆర్వో రంగారెడ్డి, గండిపేట్, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్) క్లస్టర్ గా విభజించడం జరిగింది, ఈ భవనానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ నెల చివరి నాటికి మిగిలిన 10 సమీకృత భవనాలకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ తరపున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రైవేట్ బిల్డర్స్ ఈ భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఒక్కో సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. రెండో దశలో జిల్లా కేంద్రాలలో, మూడోదశలో నియోజకవర్గాలలో భవనాలను నిర్మిస్తాం. మొదటి ఐదు సంవత్సరాలు ఈ భవనాల ను నిర్మించిన సంస్ధ మెయింటెనెన్స్ చేస్తుందని ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఖర్చు కూడా లేదు. స్లాట్ బుకింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయం కూడా చాలావరకు తగ్గిందని ఒక్కో డాక్యుమెంట్‌కు 18 నుచి 21 నిమిషాల్లోనే పూర్తవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.