ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖాన్లలో వెంటిలేటర్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సుమారు 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలు మెరుగు పడ్డాయి. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లకు చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల అవసరం పెరిగింది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, జిల్లా హాస్పిటళ్లలో వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం .

నిమ్స్‌కు కెపాసిటీకి మించి పేషెంట్లు వస్తున్నారు. చివరి నిమిషంలో ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల నుంచి వెంటిలేటర్ మీద నిమ్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువైంది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నిమ్స్‌లో అదనంగా మరో 125 వెంటిలెటర్లు ఏర్పాటు చేస్తున్నాం. నిమ్స్‌లో కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ చేయబోతున్నాం. గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్‌, ఎంజీఎంలో మాత్రమే ఎంఆర్‌‌ఐ యంత్రాలు ఉన్నాయి. మరో 9 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎంఆర్‌‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. గతేడాది కొత్తగా 213 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో ఎమర్జన్సీ రెస్పాన్స్‌ 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గింది. ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇవి అందుబాటులోకి వచ్చాక ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ 10 నిమిషాలకు తగ్గుతుంది. ఈ రెండేండ్లలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఎగ్జిస్టింగ్ డయాలసిస్ సెంటర్లలో వందకుపైగా డయాలసిస్ మిషన్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలోని ఏ పాయింట్ నుంచైనా 20 నిమిషాల ప్రయాణంలోనే డయాలసిస్ సెంటర్ ఉండేలా, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. డయాలసిస్ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది, క్యూర్ ఏరియాలో బస్తీ దవాఖాన్లను బలోపేతం చేస్తున్నాం. బస్తీ దవాఖాన్లకు ఇంతకుముందు పీహెచ్‌సీల నుంచి సరఫరా చేసేది. ఇకపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచి నేరుగా బస్తీ దవాఖాన్లకు పంపిణీ చేయబోతున్నాం. ఈ నిర్ణయంతో బస్తీ దవాఖాన్లలో మెడిసిన్ ఆర్టిఫిషియల్ కొరతకు చెక్ పెడుతున్నాం.