- చెరువు మురుగుపై హెటిరో తప్పించుకునే యత్నం
- బ్యాక్టీరియాతో చెరువు నీరు రంగు మారిందని బుకాయింపు
- వర్షాలు ఎక్కువ పడడంతో పాటు సూర్యకాంతి తగ్గడమే ప్రధాన కారణంగా తేల్చిన పరిశ్రమ
- దోమడుగులోని ఆ ఒక్క చెరువులోనే అధిక వర్షపాతం నమోదయిందా..?
- సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం
- పరిశ్రమ వివరణపై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం
హెటిరో పరిశ్రమ నుంచి కాలుష్య జలాలు నల్లకుంట చెరువును కలుషితం చేయడంతో పాటు దోమడుగు గ్రామంలో ముగాజీవాల ప్రాణాలు కబాలించాయని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. బొంతపల్లిలోని హెటిరో యూనిట్ 1 నుంచి వెలువడే కాలుష్యం వల్ల తమ గ్రామంలో ప్రజలతోపాటు మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతూ మాకు జీవించే హక్కు కల్పించాలంటూ గ్రామస్తులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కదం తొక్కారు. హెటిరో పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థ జలాలతోనే నల్లచెరువు కలుషితమైందని, ఆ పరిశ్రమ నుంచి తమ గ్రామాన్ని కాపాడాలంటూ పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లచెరువు నీరు రంగు మారి గులాబీ వర్ణంలోకి మారడానికి హెటిరోనే కారణమంటూ గ్రామస్తులు ఆరోపించారు. ఆ మేరకు పలువురు పర్యావరణవేత్తలు సైతం తమ సంఘీభావం తెలుపుతూ కాలుష్య జలాల వల్లే నీరు రంగు మారిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆరోపణలపై ఉక్కిరిబిక్కిరయిన హెటీరో యాజమాన్యం గ్రామస్థులతో చర్చలు. జరిపేందుకు పలు విధాలా ప్రయత్నాలు చేసినా, బెదిరింపులకు పాల్పడ్డ కాలుష్యంపై తమ పోరాట పంథాను విడకుండా హెటిరోపై సమరం సాగిస్తున్నారు. దీంతో ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా తమపై ఆరోపణలకు అడ్డుకట్ట పడకపోవడంతో రంగంలోకి దిగిన హెటిరో ప్రతినిధులు ఈ సమస్య నుంచి బయటపడేందుకు సరికొత్త కహాని వినిపిస్తున్నారు. ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి పొంతనలేని వాదనలు తెరమీదకు తీసుకుని వచ్చారు.
బ్యాక్టీరియాతో నీరు రంగు మారిందంటున్న హెటిరో..
దోమడుగులోని నల్లచెరువు నీరు రంగు మారడానికి కారణం బ్యాక్టీరియా అని హెటిరో ప్రతినిధులు సెలవిచ్చారు. హెటిరో డైరెక్టర్ సంబి రెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు రామ్మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ఎన్విరాన్ మెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగరాజు సరికొత్త వాదన తేరమీదికి తీసుకొచ్చారు. పర్పుల్స్ సల్ఫర్ బ్యాక్టీరియా కారణంగానే చెరువులు రంగు మారాయని వివరిస్తూ ఐఐటి హైదరాబాద్, లింకా ల్యాబ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలను రాబట్టామని తెలిపారు. దానికి తోడు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం సూర్యకాంతి తగ్గడం వల్ల ఈ బ్యాక్టీరియా విస్తరించి రంగు మార్పుకు కారణమవుతుందని వివరించారు. 70-80 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో బ్యాక్టీరియా మరణిస్తుందని స్పష్టం చేశారు. అయితే హెటిరో ప్రతినిధుల వాదనలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పక్కదోవ పట్టించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్యం చేసిన పరిశ్రమపై చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు మాత్రం నిద్రావస్థలోనే ఉన్నారు.
ఒక్క ప్రాంతంలోనే వాతావరణ మార్పులా..
బ్యాక్టీరియా ద్వారా చెరువు నీరు రంగు మారిందని ఎక్కువ వర్షపాతం తక్కువ సూర్య రష్మి కారణంగా బ్యాక్టీరియా వ్యాపించిందని చెబుతున్న హెటిరో పరిశ్రమ వివరణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థ ప్రతినిధులు చెప్తున్నట్లు బ్యాక్టీరియా వ్యాప్తికి వాతావరణ మార్పులే కారణం అయితే కేవలం దోమడుగు గ్రామంలో నల్ల చెరువులొనే అధిక వర్షపాతం నమోదు అవ్వడంతో పాటు సూర్యకాంతి తగ్గిందా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఈ కాలుష్యం సమస్య జటిలం అవుతుండడంతో ఈ సమస్య నుంచి బయటపడడానికి పసలేని వాదన తెరమీదకు తెస్తున్నారని మండిపడుతున్నారు. వారి వాదనే నిజమైతే ఈ ప్రాంతంలో మిగిలిన గ్రామాల్లో ఉన్న చెరువులలో కూడా అలాంటి బ్యాక్టీరియా ఆనవాళ్లతో రంగు మార్పు ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తున్నారు. రైతులకు నష్టపరిహారం అందిస్తున్నామని చెప్పే నెపంతో తమ ప్రాణాలను హరించడానికి చూస్తే సహించేది లేదని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని పరిశ్రమ ప్రతినిధులకు హితవు పలుకుతున్నారు. (సోర్స్: దిశ)