- పేదల, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు
- అక్రమార్కుల భరతం పడతాం – కబ్జాలపై ఉక్కుపాదం
- ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాల నిర్మాణం
- ఐదేళ్ల పాటు నిర్వహణ కూడా భవన నిర్మాణ దారులదే
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి మండలంలో ఎస్. ఎస్. ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సోమవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యం, పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాలలో సమీకృత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి – నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) భవనంలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని జూన్ నాటికి ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్ తోనే ఈ 12 సమీకృత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేగాక సమీకృత భవనాలను నిర్మించే సంస్ధలే కనీసం ఐదేళ్లపాటు వాటిని నిర్వహించాలన్న నిబంధన కూడా పొందుపరిచామని తెలిపారు. ఇక్కడ కొత్తగా పెళ్లయి రిజిస్ట్రేషన్ కు వచ్చే జంటలు, చిన్న పిల్లలతో వచ్చే తల్లులు, పేదలకు సకల సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా – సేవా కేంద్రంగా చూస్తోందని స్పష్టం చేశారు.
గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేకూర్చాలనే ఆలోచన కాకుండా పేదవారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్కరణలు తెచ్చామని మంత్రి తెలిపారు. పేదలకు గతంలో ఇచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని, ఈవిషయంలో ఉక్కుపాదంతో అక్రమాలను అణచివేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలతో విమర్శించుకునే పరిస్ధితి రాకుండా పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తుందని స్ఫష్టం చేశారు.
ఒకప్పుడు పేదలకు పంపిణీ చేసిన భూములను, అసైన్డ్ భూములను ఒక వేళ ప్రభుత్వం తీసుకోవాలనుకున్నా వారికి తగిన పరిహారం, ప్రత్యామ్నాయ స్ధలం మంజూరు వంటి చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. త్వరలో జరగబోయే మేడారం జాతర కోసం భారీ నిర్మాణాలతో ఆధునీకరించామని, ప్రజలు ఈ జాతరకు రావాలని మంత్రి పొంగులేటి కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ జి రాజీవ్ గాంధీ హనుమంత్, ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్న డిఎస్ఆర్ నిర్మాణ సంస్ధ అధినేత సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
