- కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తి
- సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న హాట్ ఎయిర్ బలూన్ అండ్ డ్రోన్ ఫెస్టివల్
- పరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్
- గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో
సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 13 నుంచి ఈ నెల 15 వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావల్సిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫెస్టివల్‌లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొననున్నారు. సాధారణ గాలిపటాల కన్నా భారీ పరిమాణంలోఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవేయనున్నారు. రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
పతంగుల పండతో పాటు కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ (CLIC) సహకారంతో స్వీట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను పుడ్ కోర్టులోని 60 స్టాళ్లలో ప్రదర్శించి, విక్రయించనున్నారు. చేనేత, హస్తకళల 100 స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. భాషా, సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చనున్నాయి.
హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచే విధంగా పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అదేశించారు. సందర్శకులకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యారికేడింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్, అగ్నిమాపక వ్యవస్ధ, బందోబస్తు, మంచినీటి సరఫరా, వైద్యసేవలు అందివ్వాలని చెప్పారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కూడా ఈసారి పతంగులను ఎగరవేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతోపాటు పర్యాటకంగా నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నగర ప్రజలు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమాల వివరాలు: అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ ( జనవరి 13-15)
వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, సమయం: ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్ (జనవరి 16-18)
వేదిక: పరేడ్ గ్రౌండ్స్: సమయం: సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు డ్రోన్ ఫెస్టివల్ (జనవరి 16-17)
వేదిక: గచ్చిబౌలి స్టేడియం ; సమయం: ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు