- సీఎం రేవంత్ విజన్, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ విధానాల విజయానికి నిదర్శనం
- ఎస్సీ స్టడీ సర్కిల్ లు ఉన్నత ఉద్యోగాలు కల్పించే విశిష్ట కేంద్రం
- ప్రభుత్వ ఉద్యోగం ఒక పదవి మాత్రమే కాదు… ప్రజల పట్ల ఉన్న గొప్ప బాధ్యత
- సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్ : తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రాష్ట్ర పాలనకు కొత్త తరపు అధికారులను అందిస్తూ రాష్ట చరిత్రలో మరో నూతన అధ్యాయాన్ని నమోదు చేసిందనీ
ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్–Iతో పాటు వివిధ కీలక హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ప్రజాసేవ–పాలన విలువలకు ప్రతీకలుగా ఎదగాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు.
ప్రజాభవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి సారధ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రూప్ 1 తో పాటు వివిధ ఉన్నత ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ సాధించిన ఈ ఫలితాలు కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదని, సమాజమంతటికీ స్ఫూర్తినిచ్చే చారిత్రక విజయాలుగా నిలుస్తాయన్నారు.
గ్రూప్–I ద్వారా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు, ఏడుగురు డీఎస్పీలు, ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు, నలుగురు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఆరుగురు ఎంపీడీవోలుగా ఎంపిక కావడం అత్యంత అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నత పరిపాలనా స్థాయికి చేరడం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ విధానాల విజయానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత కోచింగ్‌కు ఎస్సీ స్టడీ సర్కిల్ ఒక విశ్వసనీయ కేంద్రంగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన విజన్, దృఢ సంకల్పమే ఈ స్థాయి ఫలితాలకు ప్రధాన కారణమని మంత్రి తెలిపారు. అవకాశాలు లభిస్తే ప్రతిభ ఎలా వికసిస్తుందో ఈ ఎంపికలు స్పష్టంగా చాటుతున్నాయన్నారు. మహిళా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎంపిక కావడం ప్రత్యేకంగా అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం ఒక పదవి మాత్రమే కాదు… ప్రజల పట్ల ఉన్న గొప్ప బాధ్యత. మీరు చేపట్టే ప్రతి హోదా ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. అధికారంతో కాదు… సేవాభావంతో పరిపాలన సాగాలి” అని పిలుపునిచ్చారు.
ఉద్యగ నిర్వహణలో నిర్ణయాల్లో స్పష్టత, సమయపాలన, బాధ్యతాయుత చర్యలే మంచి పాలనకు పునాదులని తెలిపారు. పారదర్శకతను పని శైలిగా మార్చుకోవాలని, అవినీతికి తావులేని నిజాయితీతో కూడిన పరిపాలన అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు కాగితాల్లో పరిమితమవకుండా ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా కనిపించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. చట్ట పరిధిలో ధైర్యమైన, నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛమైన పాలన అందించాలి” అని మంత్రి కోరారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే అధికారులుగా ఉండాలని, ఫిర్యాదులను భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. సేవలందించడంలో గౌరవం, సమానత్వం, నిష్పాక్షికత, నిజాయితీ తప్పనిసరిగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కొత్తగా ఎంపికైన అధికారులదేనని తెలిపారు. పరిపాలనలో మానవీయతే అసలైన బలమని, సమస్యలను ఫైల్ నంబర్లుగా కాకుండా ప్రజల జీవన సమస్యలుగా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువలతో సన్మానించారు. నిజాయితీతో పనిచేసే అధికారులను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. అదే మీకు ఈ సమాజం ఇచ్చే గొప్ప శాశ్వత ఆస్తి” అని మంత్రి పేర్కొన్నారు. మీరు సాధించిన విజయం ప్రజాసేవతో మరింత గొప్పదిగా మారాలని, ప్రజాసేవే మీ జీవితానికి, కెరీర్‌కు అసలైన ఖ్యాతిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నర్సింహారెడ్డితో పాటు గ్రూప్ 1 లో విజయం సాధించిన ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.