ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • సత్తుపల్లి పర్యటనలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • అగ్నిగుండం చేస్తే ప్రజలు మిమ్మల్నే అగ్నిగుండంలోకి నెట్టెస్తారు
  • బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం

తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె పట్టుకుని యువతను రెచ్చగొట్టిన వారు చావలేదు కానీ.. అమాయకపు వేలాది పిల్లల్ని పొట్టనపెట్టుకున్నరు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను స్వార్థం కోసం మళ్లీ జిల్లాల పేరుమీద ఉద్యమాలు చేస్తాం..అగ్నిగుండాలు చేస్తాం..సామాన్య ప్రజలను బలిచేస్తాం అంటే..ఊరుకునే ప్రసక్తే లేదు.. ప్రజలు తెలివైన వారు.. అన్నీ గమనిస్తున్నారు మీరు ప్రజల్ని రెచ్చగొట్టి అగ్నిగుండం తయారుచేసి చలికాసుకుంట్ అంటే..ప్రజలు మిమ్మల్నే అగ్నిగుండంలోకి నెట్టెస్తారు. శాస్త్రీయంగా లేని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజనను తప్పకుండా సరిచేస్తాం. శాసనసభలో చర్చంచి, రిటైర్డ్ జడ్జీ ద్వారా కమీటి వేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, కేబినెట్ లో చర్చించి ప్రజలకు అనుకూలమైన విధంగా సరైన పునర్వవస్థీకరణ చేస్తాం.

సత్తుపల్లి : పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోకుండా పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారు. మంగళవారం సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన జరిగిన 81 మంది సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక బీఆర్ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమిని జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద పిచ్చి కుక్క కరిస్తే ఎలా పిచ్చెక్కినట్లు వాగుతారో.. అదే పద్ధతిలో గత పదేళ్లు పాలించిన వారు బ్లఫ్ చేస్తున్నారు. 10 మంది సర్పంచులను గెలిపించుకుని, కార్యకర్తలందరినీ నిలబెట్టి మేమే గెలిచామని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే గతి!
గతంలో ఎన్నికల ఫలితాలను సెమీఫైనల్స్‌గా అభివర్ణించిన మాజీ మంత్రులపై పొంగులేటి నిప్పులు చెరిగారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 69 శాతం సీట్లు గెలిచి కాంగ్రెస్ తన జైత్రయాత్రను చాటింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇది 80 శాతానికి మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.