- ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సంగీత సాయంత్ర కార్యక్రమం
తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని చారిత్రక చౌమహల్లా ప్యాలెస్‌లో ఘజల్ మరియు సూఫీ సంగీత కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. డెక్కన్ ప్రాంతపు సమ్మిళిత సాంస్కృతిక వారసత్వాన్ని, ఘజల్–సూఫీ సంగీత సంప్రదాయాల శాశ్వత వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం సాగింది. ప్రముఖ ఘజల్ మరియు సూఫీ గాయని అనితా సింగ్వి భావగర్భితమైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల, చైర్‌పర్సన్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, మాట్లాడుతూ ఘజల్ మరియు సూఫీ సంగీతం , సమగ్రత, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు సంప్రదాయ కళారూపాల పరిరక్షణతో పాటు చారిత్రక వారసత్వ ప్రదేశాలలో సాంస్కృతిక అనుభూతిని ప్రజలకు చేరువ చేస్తాయని తెలిపారు. ఈ సంగీత సాయంత్రానికి విశేష స్పందన లభించగా, కళాప్రియులు, సంగీతాభిమానులు సంపూర్ణంగా పాల్గొని కార్యక్రమాన్ని ఆసక్తిగా ఆస్వాదించారు. ఆహ్లాదకరమైన, సాంస్కృతిక వైభవంతో నిండిన వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ , వివేక్ వెంకటస్వామి; ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్; ఫహీం ఖురేషీ, ప్రెసిడెంట్, TMREIS; రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింగ్వి, రేణుకా చౌదరి మరియు అనిల్ కుమార్ యాదవ్; అడ్డంకి దయాకర్, ఎమ్మెల్సీ; నవీన్ యాదవ్, ఎమ్మెల్యే; గడ్వాల్ విజయలక్ష్మి, మేయర్, జిహెచ్‌ఎంసీ; రామకృష్ణ రావు, చీఫ్ సెక్రటరీ; శివధర్ రెడ్డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్; జయేష్ రంజన్, ఐఏఎస్; మాజీ రాజ్యసభ సభ్యులు కే. కేశవ రావు మరియు హనుమంత్ రావు; నెర్రెల్ల శారద, చైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్; తాహెర్ బిన్ హమ్దాన్, చైర్మన్, ఉర్దూ అకాడమీ; దీపక్ జాన్, చైర్మన్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు, సాంస్కృతిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో కళాభిమానులు హాజరయ్యారు.