- రికార్డు స్థాయిలో అవినీతి కేసులు..
- చివరి మూడు నెలల్లో 78 కేసులు నమోదు
- ఖమ్మం రేంజ్ సిబ్బందికి రివార్డు అందచేసిన ACB DG చారు సిన్హా
హైదరాబాద్: ఇటీవల కాలంలో లంచాలు తీసుకుంటున్న అధికారులపై తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) విరుచుకుపడుతోంది. అత్యధిక కేసులు నమోదు చేస్తూ రికార్డులతో దూసుకెళుతోంది. గత ఏడాది చివరి మూడు నెలల్లో అత్యధికంగా 78 కేసులు నమోదు చేసి సత్తా చాటింది. అందులో ఆకస్మిక తనిఖీలు 31 ఉన్నాయి. ఈ మేరకు ACB డీజీ చారుసిన్హా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన మూడు నెలల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందిని ACB DG చారు శిన్హా అభినంధించారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి రివార్డులు అందించారు.
* గత ఏడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో లంచం తీసుకుంటుండగా వలవేసి పట్టుకున్న కేసులు 39, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 2, ఇతర కేసులు 6, ఆకస్మిక తనిఖీలు 31 కలిపి 78 కేసులు నమోదు చేసింది.
* 2011 నుంచి 2025 వరకూ ఏ ఒక్క సంవత్సరంలో కూడా చివరి మూడు నెలల్లో ఇన్ని కేసులు నమోదు చేయలేదు. 2019లో మాత్రం ఆ ఏడాది చివరి మూడు నెలల్లో 49 కేసులు నమోదయ్యాయి.
* 2024 చివరి త్రైమాసికంలో ఆకస్మిక తనిఖీలు మూడు నిర్వహించగా, 2025 ఇదే సమయంలో ఏకంగా 31 నిర్వహించారు. 2013లో చివరి మూడు నెలల్లో నిర్వ హించిన పది ఆకస్మిక తనిఖీలే ఇప్పటి వరకూ అత్యధికం. గత ఏడాది ఇంతకు 3 రెట్లు ఎక్కువ నిర్వహించారు. సోమవారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో అక్కడి రేంజ్ అధికారులకు చారుసిన్హా రివార్డులు అందజేశారు. మంచి పనితీరు కనబరిచిన అనిశా సిబ్బందిని అభినందించారు. పరిపాలనలో పారదర్శకత పెరగాలంటే మరింత ఎక్కువగా కష్టపడి పనిచేయాలని ఆమె సూచించారు.