- యూరియా యాప్ పై కేంద్రం శభాష్…
- రైతులను సేంద్రియ, ఆర్గానిక్ వ్యవసాయాలు చేసేలా వారిని ప్రోత్సహించాలి
- ఆర్గానిక్ పంటలకు సర్టిఫికేషన్ ఇచ్చేలా త్వరలో సర్టిఫికేషన్ యాప్
- డిపార్ట్ మెంట్లు, కార్పోరేషన్లు వేసే అన్ని కమిటీలలో రైతుల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి
- డిపార్ట్ మెంట్ల వారీగా శాఖల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ కల్లా ఈ యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తేవాలని అన్నారు. ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో-ఆపరేషన్ మరియు హార్టికల్చర్ శాఖల పురోగతిపై వ్యవసాయశాఖ సెక్రటరి మరియు ఆయా శాఖల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం మరియు తెలంగాణ విజన్ 2047 కార్యాచరణ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నప్పటికి, మార్కెట్లో నకిలీ ఆర్గానిక్ లేబుల్‌లతో నకిలీ ఉత్పత్తులు చలామణీ అవుతున్నందున నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం చేకూరుతుందని మంత్రిగారు అన్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఒక యాప్ తీసుకురానుందని అన్నారు. ఈ యాప్ ద్వారా కొనుగోలుదారు తాను కొనబోయే ఉత్పత్తి ఎక్కడ, ఏ రైతు, ఎలా పండించాడో తెలుసుకుంటాడని అన్నారు. అదేవిధంగా అగ్రివర్సిటీలలోని ఖాళీ ప్రదేశాలలో ఆర్గానికి పంటలు పండించి, అక్కడే స్టాల్స్ పెట్టి అమ్మినట్లైతే రైతులు ఆర్గానిక్ పంటలవైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు రైతులకు కావాల్సిన యంత్రాలు మార్కెట్ ధరలకే లభించేలా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతులకు చేరేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పట్టించుకోని కేంద్ర ప్రాయోజిత పథకాలను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రిగారి ఆదేశాలనుసారం ఒకొక్కటిగా పునరుద్ధరిస్తోందని, అందులో భాగంగా ఈ సంవత్సరం వివిధ పథకాల క్రింద ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని, కేంద్రం నుంచి వచ్చే ఒక్క పైసా కూడా వృథాగా తిరిగి వెళ్లకూడదని అధికారులకు సూచించారు.
వచ్చే ఖరీఫ్ నాటికి పెద్దమొత్తంలో యూరియా బఫర్ స్టాక్ లను నిల్వలో ఉంచుకోవాలని, భవిష్యత్తులో యూరియా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, రైల్వే రేక్ పాయింట్లను కూడా ఎరువుల పంపిణీకి తగ్గట్లుగా ఉండేలా, మరికొన్ని రైల్వే రేక్ పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసేవిధంగా రైల్వే అధికారులను కోరాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాలకు బోనస్ ఇస్తున్నందున, పంటకాలనికి అనుగుణంగా వ్యవసాయశాఖ ద్వారా సన్న వడ్లలో మేలైన వంగడాలను సూచించాలని, రైతులు అట్టి రకాలను ఉత్పత్తి చేసి మంచిధర పొందేటట్లు చూడాలని అన్నారు. అధికశాతం ఖచ్చితత్వంతో శాటిలైట్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటల శాటిలైట్ మ్యాపింగ్ డేటా రావాలని అధికారులను ఆదేశించారు. 3 సంవత్సరాల పంటల శాటిలైట్ మ్యాపింగ్ తో డేటా అందించాలని, డేటా ఫైనలైజ్ చేసేముందు ఒకసారి అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల డిపాజిట్లు ప్రైవేట్ కమర్షియల్ బ్యాంకులలో కాకుండా కో-ఆపరేటివ్ మరియు అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకులలో చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో కేంద్రం ఇచ్చిన లక్ష్యానికి రెట్టింపు ప్లాంటేషన్ జరిగేలా అధికారులు పనిచేయాలని మంత్రి అన్నారు. తక్కువ పురోగతి ఉన్న ఆయిల్ పామ్ కంపెనీలను రద్దు చేసి, వాటిని ఆయిల్ ఫెడ్ సంస్థకు గాని, వేరే ఇతర కంపెనీలకు కేటాయించాలన్నారు. ఆయిల్ పామ్ కంపెనీలకు సంబంధించిన ఖాళీ ప్రదేశాలలో మోడల్ పామ్ అభివృద్ధి చేసి, ఆయిల్ పామ్ రైతుల సందర్శనార్థం ఉంచినట్లైతే, వారికి వచ్చే అనుమనాలను కూడా నివృత్తి చేసుకోవడానికి వీలు కలుగుతుందని అన్నారు.
పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 44 శాతానికి పెంచినట్లైతే టన్ను ఆయిల్ పామ్ ధర 25000 వరకు చేరుకుంటుందని, దాంతో రైతులకు కూడా ఆయిల్ పామ్ పంట వేయలనే కోరిక పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలలోనే దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాల కోసం కూరగాయలను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితి మారాలని మంత్రిగారు అన్నారు. డిమాండ్ కు తగ్గట్టుగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని, కూరగాయల సాగులో విజయవంతం అయిన రైతులను రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఇతర రైతులతో మాట్లాడించాలి. గ్రామాలలోనే కాకుండా పట్టణాలలో కూడా అందుబాటులో ఉన్న స్థలాలలో మరియు టెర్రస్ ల మీద కూరగాయలు పండించేలా అవగాహన కల్పించాలని అన్నారు.
రైతులకోసం డిపార్ట్ మెంట్లలో గాని, యూనివర్సిటీలలో గాని మరియు కార్పోరేషన్లలో గాని ఏర్పాటు చేసే ప్రతి కమిటీలలో అధికారులతో పాటు రైతుల ప్రాతినిధ్యం వహించేలా కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కమటీలలో రైతుల ప్రాతినిధ్యం ఉన్నట్లైతే రైతుల అవకాశాలు, అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. రైతు వేదికల దగ్గర సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. డిపార్ట్ మెంట్లకు సంబంధించి ఉన్న ఖాళీ ప్రదేశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయి మిగిలిన కరెంట్ ను గ్రిడ్ కు అమ్ముకొవచ్చని అన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రెండు రైతువేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయగా, నెలకు 400 యూనిట్ల వరకు మిగులు కరెంట్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హర్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, HACA ఎండి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.