- జాతర నిర్వహణలో 50 వేల మంది అధికారులు, సిబ్బంది
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో వారంరోజులు మాత్రమే ఉండడంతో ఈ జాతర ఏవిధమైన ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 28 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు కోటిన్నర కు పైగా మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం చరిత్రలో గతంలో మరెన్నడూ లేని విధంగా 2026 జాతరకు రూ. 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కేటాయించారు. మరో వందేళ్ల వరకు నిలిచిపోయేలా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధికే రూ. 100 కోట్లను కేటాయించి రికార్డు సమయంలో పనులను పూర్తి చేశారు. ఈనెల 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఈ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు.
జాతర నిర్వహణకు 50,000 మంది అధికారులు, సిబ్బంది
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈజాతరకు వచ్చే భక్తులు మూడు దశలలో వస్తారు. జాతర ప్రారంభానికి ముందుగానే దాదాపు 30 నుండి 35 శాతం అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతర సమయంలో 60 నుండి 65 శాతం, జాతర అనంతరం 3 .5 శాతం భక్తులు దర్శించుకుంటారు. ఇందుకుగాను, మేడారం జాతర ప్రదేశాన్ని మొత్తం 8 ప్రధాన పరిపాలనా జోన్ లుగా విభజించారు. ఈజోన్ ఒక్కొక్కటికి ఒక జిల్లా స్థాయి అధికారిని జోనల్ అధికారిగా, సీనియర్ అసిస్టెంట్ అధికారిని అసిస్టెంట్ జోనల్ అధికారిగా నియమించారు. 42 సెక్టార్లుగా ఏర్పాటుచేసి ఒక్కో సెక్టార్ కు మండల స్థాయి అధికారిని ఇంఛార్జిగా నియమించారు. వీటిలో ముఖ్యంగా, టెంపుల్ -చిలకలగట్టు ప్రాంతాన్ని జోన్ – 1 గా పెట్టి దీనిలో మాస్టర్ కంట్రోల్ రూమ్,మేడారం ప్రోటోకాల్ ఆఫీస్, టెంపుల్ ఎంట్రీ పాయింట్స్, టెంపుల్ ఎగ్జిట్ పాయింట్లు, గద్దెల వద్ద తప్పిపోయిన వారి క్యాంపు, మీడియా సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సు స్టాండ్- రెడ్డిగూడెం ను రెండవ జోన్ గా ఏర్పాటుచేసి బస్సుల అలైటింగ్ పాయింట్స్, మెస్, అధికారులు, ఉద్యోగుల బసను ఏర్పాటుచేశారు. స్తూపం, కోటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 3, 4 జోన్లలోనూ తప్పిపోయిన వారి కేంద్రాలు, ఓవర్ అల్ మానిటరింగ్ టీమ్స్, షటిల్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసారు. ఊరట్టం, శివరాం నగర్, పడిగాపూర్, నార్లాపూర్ లను మిగతా జోన్ లుగా విభజించి తగు ఏర్పాట్లు చేశారు.
21 శాఖలచే సివిల్, నాన్-సివిల్ పనుల నిర్వహణ
ఈజాతరకు సంబంధించి సివిల్, నాన్ సివిల్ పనులను 21 ప్రభుత్వ శాఖలు చేపట్టాయి. ఎన్.ఎస్.ఎస్, ఆదివాసీ యూవకులు మొత్తం 2000 వేల మంది ప్రత్యక్షంగా ఈ జాతర నిర్వహణలో స్వచ్ఛందంగా భాగస్వామ్య మవుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 50 వేల మంది అధికారులు, సిబ్బంది ఈ మేడారం జాతరను సక్రమంగా నిర్వహించడానికి నియమించారు. వీరిలో, ప్రధానంగా ఆరు వేలమందిని ప్రీ-జాతరకు ముందుగా, 32 వేల మందిని నాలుగు రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా, ఆరువేలు పైగా సిబ్బందిని జాతర అనంతరం ఏడు రోజులపాటు పనులు నిర్వహించేందుకు కేటాయించారు. మెరుగైన నెట్వర్క్, కమ్యూనికేషన్ కు 27 శాశ్వత సెల్ టవర్స్, 33 వీల్ సెల్ టవర్స్ కోటిన్నర మందికి పైగా హాజరయ్యే ఈ జాతర సమయంలో మెరుగైన మొబైల్ సెల్ సేవలను అందించేందుకు BSNL , ఎయిర్ టెల్, జియో తదితర మొబైల్ ప్రొవైడర్లు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. ఇప్పటికే, 27 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాయి. మరో, 33 వీల్స్ టవర్లు, 450 VHF సెట్స్ లను ఏర్పాటు చేశాయి.
