ఇబ్రహీంపట్నం పట్టణ ప్రగతిలో సీఎస్ సోమేశ్‌కుమార్‌రంగారెడ్డి జిల్లాలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్ పలు ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వెంటనే నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల కమిషనర్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు పట్టణ ప్రగతిలో చురుగ్గా పాల్గొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని, పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రతను పెంచాలని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.