ప్రతి నిత్యం జర్నలిస్టులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ. నర్సింహరెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నల్లగొండ జల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు రెండు రోజల శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ. నర్సింహరెడ్డి మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ తను నల్లొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠిశాలలో చదువుకున్నట్లు తెలిపారు. అలాగే జర్నలిజంతో ముడిపడిన అనేక అంశాలు – అనుభవాలు ప్రస్తావించారు.
తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటల్ మీడియాలో భాగంగా AIని ఉపయోగిస్తున్న జర్నలిస్టుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందన్నారు. అదే విధంగా జర్నలిజం వృత్తిలో పరిపూర్ణత రావడానికి ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సాధారణ వ్యక్తులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలను చేరవేస్తున్నారు. మీడియాలో సాంకేతికత పెరిగినందున జర్నలిస్టులు సంమయమనం పాటిస్తూ, నిజ నిర్థారణ చేసుకున్నాకే వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయాలని ఆయన సూచించారు.
జర్నలిస్టుల శిక్షణలో భాగంగా మొదటి రోజు “గ్రామీణ వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియా” అనే అంశంపై రచనా జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ఉమా మహేశ్వర రావు, “ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, ఏ.ఐ., సోషల్ మీడియాలో అవలంభించాల్సిన పద్థతులపై” ముద్దం నర్సింహస్వామి వివరించారు. సీనియర్ జర్నలిస్టు గోవిందరెడ్డి “నేర వార్తలు” అనే అంశంపై బోధించారు. “సమాచార హక్కు చట్టం-2005” అంశంపై సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.