తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించిన ట్రంప్‌ దంపతులు

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి ప్రఖ్యాతివహించింది. తాజ్‌మహల్‌ని సందర్శించడమంటే అదో అద్భుతమైన ప్రేమ భావన. అమెరికా ఇతర అధ్యక్షుల్లా మాదిరి కాదు.. ట్రంప్, మెలానియా ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని కనిపించరు. కానీ ఈ తాజ్‌ ఏ మాయ చేసిందో ఏమో మెలానా చేతిలో చెయ్యి వేసుకుంటూ తాజ్‌ ఉద్యానవనంలో కలియతిరుగుతూ అలౌకికమైన ఆనందానికి లోనయ్యారు ట్రంప్‌. ఆ తన్మయత్వంలోనే సందర్శకుల పుస్తకంలో ‘‘తాజమహల్‌ వావ్‌ అనిపించింది.
సుసంపన్నమైన, విలక్షణ విభిన్నమైన భారతీయ సంస్కృతికి ఈ కట్టడం కాలాతీతంగా నిలిచిన పవిత్ర శాసనం. థాంక్యూ ఇండియా’’అని రాశారు. ట్రంప్‌ దంపతులు తాజ్‌మహల్‌లో గంటకు పైగా కలియతిరుగుతూ అణువణువు సౌందర్యంతో నిండిపోయిన ఆ కట్టడం అందాలను ఆస్వాదించారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన తాజ్‌మహల్‌ గొప్పతనాన్ని ఒక గైడ్‌ వారికి వివరించి చెప్పారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌ కూడా వారి వెంట ఉన్నారు. అయితే ఇతర ప్రతినిధుల బృందంతో పాటు వారు దూరం నుంచి తాజ్‌మహల్‌ అందాలను వీక్షించారు. తాజ్‌ అందాలను ఇవాంకా తన మొబైల్‌ ఫోన్లో బంధిస్తూ కనిపించారు.