- అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
- నిరంతర విధ్యుత్ సరఫరాకు 196 ట్రాన్సఫార్మర్లు, 67 కి.మీ ఎలక్ట్రిక్ లైను
హైదరాబాద్, జనవరి 24 : మేడారం మహా జాతర ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో జాతరకు హాజరయ్యే దాదాపు కోటిన్నర మంది భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. ఈనెల 28 ప్రారంభమయ్యే జాతరకు హాజరయ్యే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ గత జాతరలకన్నా అదనపు ఏర్పాట్లను చేసింది. ప్రధానంగా రెడ్డిగూడెం నుండి జంపన్న వాగు మీదుగా చిలకలగుట్ట వరకు నీటి మట్టాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జంపన్న వాగులో ఉన్న 29 ఇంఫిలిట్రేషన్ వెల్స్ ల పూడికను చేపట్టింది. స్నాన ఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ (BoT ) లను పునరుద్దరించడంతోపాటు బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లకు నిరంతర నీటిని అందించేందుకు ఇంఫిల్టరేషన్ వెల్స్ లో సుబ్మెర్సిబుల్ పంపులను ఏరాటు చేసి పైప్ లైన్లను నీటిపారుదల శాఖ చేపట్టింది. నీటిపారుదల శాఖ ద్వారా దాదాపు రూ. 50 కోట్ల నిధులతో భక్తులకు ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగు పొడుగునా 348 బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లను, 119 డ్రస్ చెంగింగ్ రూమ్ లను, జంపన్న వాగులో నీటి మట్టాన్ని ఒకే తీరుగా ఉంచేందుకు 9 క్రాస్ బండ్ లను నిర్మించారు. వీటితోపాటు, జంపన్న ఘాట్ లపై ఉన్న మెట్ల మరమత్తులు, జంపన్న వాగులో జలాలు కలుషితం కాకుండా నిరంతరం క్లోరినేషన్ చేపడుతున్నారు.
అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
తాడ్వాయి మండలంలో దట్టమైన అడవిలో జరిగే ఈ మేడారం జాతర సందర్బంగా అటవీ సంరక్షణ తోపాటుగా పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా, అటవీ సంపద ధ్వంసం కాకుండా ఉండేందుకు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాణాల నివారణ, దట్టమైన అడవుల గుండా వాహనాల రాకపోకల వేగాన్ని నియంత్రించడం లాంటి పనులను అటవీ శాఖ చేపట్టింది. వీటితోపాటు, ఖాళీగా ఉన్న అటవీ భూములలో పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది.
నిరంతర విధ్యుత్ సరఫరాకు 196 ట్రాన్సఫార్మర్లు, 67 కి.మీ ఎలక్ట్రిక్ లైను
మేడారం జాతరలో అంత్యంత కీలకమైన విధ్యుత్ శాఖ, 24 గంటలూ ఏ ఒక్క నిమిషం కూడా విధ్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 911 ఎలక్ట్రిక్ స్తంబాలు, 196 ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేసి వీటి నిర్వహణకు 350 అదనపు సిబ్బందిని నియమించింది. వీటితోపాటు, 43 పార్కింగ్ ప్రాంతాలలో కూడా విధ్యుత్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే, జాతర ప్రాంతంలో ఉన్న 11 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్ లను సిద్ధం చేసింది. భక్తుల రక్షణ చర్యల్లో భాగంగా, 11 కేవీ, 33 కేవీ లైన్లు క్రాస్ అయ్యే జంపన్న వాగు వద్ద ఆరు గస్తీ టవర్లను ఏర్పాటుచేశారు. 50 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎమర్జెన్సీ బృందాలను నియమించారు. తాడ్వాయి, పస్రా మార్గంలో పెట్రోలింగ్ టీమ్ లను కూడా నియమించారు. నాలుగు ట్రాన్స్ఫార్మర్లకు ఒక బృందం చొప్పున(ఏఈ, ముగ్గురు ఆపరేషన్ సిబ్బంది) పర్యవేక్షించనుంది. 33 కేవీ లైన్స్ పర్యవేక్షణకు తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట, చెల్పూర్, ఏటూరునాగారం, కమలాపూర్, ములుగు సబ్స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ఇవే ప్రాంతాల్లోని ఈహెచ్టీ సబ్స్టేషన్ల వద్ద విద్యుత్ సరఫరా పర్యవేక్షించేందుకు 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.. అత్యవసర పనుల కోసం సామగ్రిని తరలించేందు కు 30 వాహనాలను కేటాయించారు.
